- చంద్రమా భట్టాచార్య రాజీనామా..
- పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ప్రకటన..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. మమతకు అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య టీఎంసీకి రాజీనామా చేశారు. పార్టీకి చెందిన అన్ని పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఇకపై పార్టీకి పూర్తి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.
ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా చేయడం అంటే ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. టీఎంసీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు, కాలిఘాట్‌లో మమతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రిమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీఎంసీకి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లకు సంబంధించి బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు, అలాగే, తన సంతకాన్ని కూడా వాటి నుంచి తొలగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఇకపై, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఆమె సంతకం చెల్లదు. పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ.. ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే, తన రాజీనామాకు గల కారణాన్ని చంద్రిమ వెల్లడించలేదు. ఉన్నట్లుండి ఆమె తన పదవులకు రాజీనామా చేయడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
