- జూన్ 13తో ముగియనున్న పుష్కరాలు..
ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. దేవగురువు బృహస్పతి సంచారం ఆధారంగా నదులకు పుష్కరాలు వస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానం వలన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఏ నదికి పుష్కరాలు రానున్నాయి? పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎన్ని రోజులు జరుగుతాయి? పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? పుష్కరాల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.
ఉత్తరాఖండ్ లోని యమునోత్రి వద్ద ఉద్భవించిన యమునా నది ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో యమునోత్రి తో పాటు మధుర, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం, కాళీపీ ఘాట్‌లు, ఆగ్రా పరిసర నదీతీర ఘాట్లు పుష్కర స్నానాలకు అత్యంత ప్రసిద్ధి.
సాధారణంగా బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు, పుష్కరుడు సంబంధిత నదిలోకి ప్రవేశించి ఏడాది కాలం పాటు ఆ నదిలోనే ఉంటాడు. ఈ క్రమంలో ఏడాది మొత్తం ఆ నదికి పుష్కర శోభ ఉన్నప్పటికీ ప్రత్యేకించి మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పవిత్ర పుష్కర స్నానాలు చేయడం పుణ్యప్రదమని భావిస్తారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో ఆచరించించాల్సిన విధివిధానాలు తెలుసుకుందాం.
దశవిధ స్నానాలలో తీర్ధ స్నానం ఉత్తమమైనది అయితే పుష్కర పుణ్య సమయంలో ఆచరించే పుష్కర స్నానం విశేష ఫలదాయకం అని పెద్దలు చెప్తుంటారు. పుష్కర స్నానానికి నదిలో దిగేముందు పురుషులైతే గట్టు మీద ఉన్న మట్టిని, స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట.
పవిత్ర నదుల్లో పుణ్య స్నానం ఆచరించే ముందు ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్లాలి. భక్తిగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చేయకూడదు.
