- విమానాశ్రయం కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ
- 700 ఎకరాలు సేకరించాలని కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆదిలాబాద్లో విమానాశ్రయం కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎయిర్ పోర్టు కోసం భూసేకరణ చేయాలని ఆదేశించింది. ఆదిలాబాద్లో 700 ఎకరాలు సేకరించాలని కలెక్టరు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ప్రభుత్వం ఆమోదించింది. కేంద్రవిమాన యాన సంస్థ కూడా మొగ్గుచూపింది.
రాష్ట్రంలోనివరంగల్, ఆదిలాబాద్లలో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను రానున్న రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. భూసేకరణకు సంబంధించిన అన్ని పక్రియలు పూర్తి కాగానే పనులు ప్రారంభించడానికి ఏఏఐ సిద్ధమవుతోంది. ఇప్పటికే వరంగల్లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ పూర్తి కావొచ్చింది. ఇక్కడ అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆదిలాబాద్ లోనూ బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలుపడంతో ఏఏఐ రాబోయే రెండేళ్లలో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కాగా, స్థానిక పరిస్థితులను బట్టి 2027 డిసెంబరులోగా అందుబాటు లోకి తెస్తామని కేంద్రం గతంలో తెలిపినట్లు సమాచారం. ఈ రెండు విమానాశ్రాయాలకు అనుమతులు ఇచ్చామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తెలిపారు. దీంతో వేగంగా అడుగులు పడనున్నాయి. ఇది పూర్తయితే మహారాష్ట్ర ప్రజలకు కూడా అందుబాటులోకి రాగలదు
