- ఉత్తరాఖండ్ లో వెలుగు చూసిన ఘటన..
- మే 29 న అదృశ్యమైన యువతి..
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత పరిసరాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఎంబీయే విద్యార్థిని బబితా పాండే గత పది రోజులుగా కనిపించకుండా పోయింది. దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ మార్గంలోని గోయ్ బేస్ క్యాంప్ నుంచి మే 29 అర్ధరాత్రి ఆమె అదృశ్యమైంది. నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌కు చెందిన బబితా పాండే.. తన స్నేహితులైన హర్మాన్‌పాల్ సింగ్, హర్మాన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి మే 29న ఉత్తరకాశీ చేరుకుంది. రైతల్ గ్రామం నుంచి వీరు ట్రెక్కింగ్ ప్రారంభించి, రాత్రికి గోయ్ బేస్ క్యాంప్‌లో టెంట్లు వేసుకుని బస చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత బబితా అక్కడ నుంచి మాయమైంది.
బబిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి మధ్య ఏవైనా వ్యక్తిగత గొడవలు జరిగాయా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు సాగుతోంది. మే 30 నుంచి దాదాపు 150 మంది SDRF, NDRF, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది 5 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఎత్తైన పర్వత ప్రాంతాలు కావడంతో ఆదివారం నుంచి హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే అడవుల్లో స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. బేస్ క్యాంప్ సమీపంలోని ఒక సరస్సులో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు జరుపుతున్నారు. అయినప్పటికీ బబితా జాడ దొరకకపోవడంతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
