హాజీపూర్ మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యు ఎస్ ఐ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ తిరుపతి రెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై పెరుగుతున్న ఫీజుల భారం నేపథ్యంలో, ప్రతి పాఠశాల యాజమాన్యం వారు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తరగతి వారీగా స్పష్టంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని కోరారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఫీజుల విషయంలో పారదర్శకతను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సభ్యుల వివరాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం, విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీసెస్), అత్యవసర సేవలకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అవసరమైన సమయంలో సంబంధిత అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే చర్యలు చేపట్టాలని USFI డిమాండ్ చేసింది.
