- సర్వే నెంబర్ 540,88 ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల పరిశీలన…
మఠంపల్లి: భూముల వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా 22-ఎ నిషేధిత జాబితా అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మఠంపల్లి మండలంలోని పెదవీడు, మట్టపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 540,88 ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆదాబ్ హైదరాబాద్ పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు మండల రెవెన్యూ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.
ఈ విషయంపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ ఆదేశాల మేరకు మండలంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూముల రికార్డులు, ఆక్రమణల పరిస్థితి,హద్దులు, భూముల సేద్యం చిట్టాపై మండల తహసిల్దార్ వెంటనే నివేదిక సమర్పించాలని కోరడంతో మఠంపల్లి తహసీల్దార్ హిమ బిందు, ఆర్ఐ శివ తదితర రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో శుక్రవారం పర్యటించి ప్రభుత్వ దస్త్రాల్లో నమోదైన వాటి ప్రస్తుత వివరాలు,స్థితిగతులు,భూముల హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిపోల్చి వాటి వివరాలను నమోదు చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్న ఉపేక్షించేది లేదని రెవెన్యూ చట్టం ప్రకారం ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సర్వే నంబర్ 540 లోని ప్రభుత్వ భూములపై ప్రత్యేక పరిశీలనMattampally
పెదవీడు రెవెన్యూ పరిధిలోని కామాక్షి సిమెంట్ పరిశ్రమ గతంలో మైనింగ్ అవసరాల కొరకు లీజు తీసుకున్న సర్వే నెంబర్ 540 భూములకు సంబంధించి సుమారు 46 ఎకరాల భూమి రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో అట్టి భూములకు లీజుకు సంబంధించి అనుమతులు రాకపోవడంతో ఆ పరిశ్రమ భూములను ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది.అయితే అట్టి భూముల ప్రస్తుత పరిస్థితి,వాటిలో ఆక్రమణలు, నిర్మాణాలు,వ్యవసాయ క్షేత్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిశీలించారు.
వాటి భూములకు సంబంధించి రికార్డుల్లో నమోదైన వివరాలు,భూముల హద్దులు పరిశీలించి సంబంధిత వివరాలను తాజాగా నమోదు చేశారు.అదే విధంగా మట్టపల్లి రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 88 పులిచింతల ప్రాజెక్ట్ ముంపు భూముల్లోని కొందరు వ్యక్తులు అక్రమంగా చెట్లు నరికివేసి,భూమి చదును చేసి,ఆక్రమించుకొని పొలం చేసినట్లుగా స్థానికులు ఫిర్యాదు చేయడంతో వాటి భూములపైనా కూడా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక తయారు చేశారు.ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కు నివేదిక పంపుతామని తహసిల్దార్ స్పష్టం చేశారు.
ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో అక్రమార్కుల్లో టెన్షన్Mattampally
మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములకు సంబంధించి గతంలో ఆక్రమణల ఆరోపణలు,భూముల హద్దులు,రికార్డుల మార్పులు చేర్పులు చేసినట్లుగా ఆరోపణలు రావడం పైగా స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో అధికారుల తాజా తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ఏ ప్రాంతంలో ఆక్రమణలు జరిగినట్లు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.ముఖ్యంగా రెవెన్యూ,అటవీ శాఖల పరిధిలోని భూములకు సంబంధించిన రికార్డులు,హద్దులు, భూముల వర్గీకరణ, ప్రస్తుత పరిస్థితిపై ఉమ్మడి సర్వే నిర్వహించి సమగ్ర పరిశీలన జరిపి స్పష్టత ఇవ్వాలని స్థానికులు, రైతులు అధికారులను కోరుతున్నారు.రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వెలువడే నివేదికపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏయే భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వాటి ప్రస్తుత తాజా పరిస్థితి ఏమిటి ఎంత వరకు ఆక్రమణలు జరిగాయి తదుపరి చర్యలు ఏమిటనే అంశాలపై అధికారుల నివేదికలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరిశీలనలో రెవెన్యూ అధికారుల వెంట హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
