- భక్తులతో కిట కిటలాడిన ఆలయ ప్రాంగణం…Shambhu Lingeswara Temple
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.మంగళవారం తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి.Shambhu Lingeswara Temple
ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం మహిళలు భక్తిశ్రద్ధలతో ధ్వజస్తంభం వద్ద ఉసిరికాయ దీపాలు, 365 వత్తుల కార్తీక దీపాలను వెలిగించడంతో ఆలయ ప్రాంగణం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అనంతరం ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కింద నుంచి స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండువగా సాగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
