Homeమహబూబ్‌నగర్‌Stray Dog Attack | సాలార్‌పూర్‌లో మేకల మందలపై వీధి కుక్కల దాడి

Stray Dog Attack | సాలార్‌పూర్‌లో మేకల మందలపై వీధి కుక్కల దాడి

  • గుంపులుగా విరుచుకుపడి 18 మేక పిల్లలు మృతి
  • రూ.2.50 లక్షల నష్టం..
  • కుక్కల బెడదపై సర్పంచుల పిర్యాదులు
  • నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వీధి కుక్కల బెడద పశుపోషకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామాల్లో గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు మేకల మందలు, మేక పిల్లలపై దాడులకు(Stray Dog Attack) పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ముఖ్యంగా రాత్రివేళ మేకల కొట్టాల్లోకి చొరబడుతూ అవకాశం దొరికినప్పుడు గుంపులుగా దాడి చేయడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.

మేకలు,గొర్రెల పెంపకాన్నే జీవనాధారంగా చేసుకున్న చిన్న,సన్నకారు పశుపోషకులకు ఇలాంటి ఘటనలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి.ఒకటి రెండు మేకలు మృతి చెందినా కుటుంబ ఆదాయంపై ప్రభావం పడుతుండగా.. ఒకేసారి పెద్ద సంఖ్యలో మేక పిల్లలు మృతి చెందడం బాధిత కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తోందని వాపోతున్నారు.

- Advertisement -

సాలార్‌పూర్‌లో ఒక్క ఘటనలో 18 మేక పిల్లలు మృతి

కడ్తాల్ మండలం సాలార్‌పూర్ గ్రామంలో శనివారం వీధి కుక్కల దాడి కలకలం(Stray Dog Attack) రేపింది.గ్రామానికి చెందిన మేకల కాపరి కావలి జంగయ్య మేక పిల్లలను కొట్టంలో ఉంచిన సమయంలో వీధి కుక్కలు గుంపుగా దాడి చేసినట్లు తెలిపారు.కుక్కలు ఒక్కసారిగా మేక పిల్లలపై విరుచుకుపడటంతో వాటిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో 18 మేక పిల్లలు మృతి చెందగా,సుమారు రూ.2.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.మేకల పెంపకమే తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారమని,అప్పులు చేసి లేదా పొదుపు చేసిన డబ్బుతో పెంచుకున్న మేక పిల్లలను కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని జంగయ్య వాపోయారు.

బాధితుడి ఆవేదన..

అధికారులకు చెప్పినా స్పందన లేదంటూ ఆరోపణ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని,వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గతంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జంగయ్య తెలిపారు.అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపించారు.

తాజాగా కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి చెందిన అనంతరం పశువైద్య సహాయం కోసం అధికారులను సంప్రదించినప్పటికీ తగిన స్థాయిలో స్పందన రాలేదని బాధితుడు ఆరోపించారు.ప్రభుత్వ పశువైద్య సిబ్బంది వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని, డబ్బులు అడిగారని కూడా ఆయన ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.

సర్వసభ్య సమావేశంలోనూ వీధి కుక్కల సమస్య

వీధి కుక్కల సమస్య కేవలం సాలార్‌పూర్ గ్రామానికే పరిమితం కాలేదని తెలుస్తోంది.ఇటీవల జరిగిన కడ్తాల్ మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచులు,ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వీధి కుక్కల బెడదపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటి నియంత్రణకు తగిన చర్యలు కనిపించడం లేదని,గ్రామాల్లో ప్రజలు,పశువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది.

పశుపోషకుల్లో పెరుగుతున్న ఆందోళన

మేకలు,గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఒక్కో జంతువు విలువైనదే.ముఖ్యంగా మేక పిల్లలను పెంచి,వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వారికి ఇలాంటి దాడులు పెద్ద దెబ్బగా మారుతున్నాయి.ఒకవైపు మేతకు వెళ్లే సమయంలో కుక్కల దాడి భయం,మరోవైపు రాత్రివేళ కొట్టాల్లో ఉన్న మేకలపై దాడుల భయం పశుపోషకులను వెంటాడుతోంది.దీంతో తమ జీవనాధారమైన పశువులను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

సాలార్‌పూర్ ఘటనను దృష్టిలో ఉంచుకుని కడ్తాల్ మండలంలోని గ్రామాల్లో వీధి కుక్కల సమస్యపై అధికారులు సమగ్రంగా దృష్టి సారించాలని పశుపోషకులు కోరుతున్నారు.కుక్కల నియంత్రణకు చట్టబద్ధమైన,శాస్త్రీయ విధానాల్లో చర్యలు,ప్రమాదకర గుంపులను గుర్తించడం,గ్రామాల్లో అవగాహన కల్పించడం,పశువులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మేక పిల్లలను కోల్పోయిన జంగయ్య కుటుంబానికి జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించి,ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం లేదా అందుబాటులో ఉన్న సహాయాన్ని కల్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.వీధి కుక్కల సమస్యపై ఇప్పటికే మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన నేపథ్యంలో.. తాజాగా 18 మేక పిల్లలు మృతి చెందిన ఘటనతోనైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News