- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విడిచిన తుదిశ్వాస
- అర్ధరాత్రి 12:51 గంటలకు మృతి చెందినట్లు వైద్యుల అధికారిక ప్రకటన
- విషాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లా…. గొల్లున ఏడ్చిన ఓరుగల్లు…. చివరి చూపుకు జననిరాజనాలు.. కిలోమీటర్ల మేర తట్టిన ట్రాఫిక్
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతివార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యశోద ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఉదయం 6:30 గంటలకు అంబులెన్సులు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం హనుమకొండకు చేరుకోగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అశ్రునయనాల మధ్య చివరి చూపు చూసి తల్లడిల్లిపోయారు.
అనంతరం వరంగల్ నుండి ధర్మారం గీసుకొండ కొమ్మాల మీదుగా నర్సంపేట నియోజకవర్గం గిర్ని బావికి చేరుకోగా దుగ్గొండి మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున విలపిస్తూ చివరి చూపు కోసం తపన పడ్డారు. అనంతరం లక్నపల్లి మహేశ్వరం నర్సంపేట పట్టణం ముత్తూపేట ఇటుకల పెళ్లి రుద్రగూడెం మీదుగా నల్లవెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరనుంది.

పెద్ది రాజకీయ ప్రస్థానం
ప్రతి రాజకీయ నాయకుడి ప్రయాణం ఒక పదవితో ప్రారంభం కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలనే తపన, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలనే కృషితో ఆ ప్రయాణం రూపుదిద్దుకుంటుంది. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అలాంటి ప్రజా ప్రస్థానమే.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అనేక మంది నాయకులు తమ ముద్ర వేశారు. ఆ వరుసలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని, గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుంది.
ఆయన ఎదుగుదల ఒక్కసారిగా జరిగినది కాదు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకం కావడం, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడం, స్థానిక సమస్యలపై స్పందించడం ఉద్యమాలు చేయడం ద్వారా క్రమంగా రాజకీయంగా ఎదిగారు. ప్రజల మధ్య తిరుగుతూ వారి అవసరాలను అర్థం చేసుకోవడం ఆయన నాయకత్వానికి పునాదిగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కాలంలో, ఉద్యమ భావజాలానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాల్లో ఆయన పాత్రకు గుర్తింపు లభించింది.
ప్రజా నాయకుడికి ఎన్నికల్లో విజయం మాత్రమే ప్రమాణం కాదు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం, సమస్యలు విని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, కార్యకర్తలతో నిరంతర సంబంధం కొనసాగించడం వంటి లక్షణాలు ఆయన రాజకీయ జీవితంలో ప్రధానంగా కనిపించాయి.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజం. అయినప్పటికీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా చెప్పబడుతుంది. నర్సంపేటలో జరిగిన ఎన్నికలు ఆయనకు విజయాలను మాత్రమే కాదు, పరాజయాల ద్వారా మరింత ప్రజల మధ్యకు వెళ్లే అవకాశాన్ని కూడా ఇచ్చాయి.
యువ జ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షుడిగా మొదటి ప్రస్థానం
నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటర్మీడియట్లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ లో పనిచేశారు. అనంతరం గ్రామంలో జరిగిన పాటల పోటీల సమయాలలో నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న యువజ్యోతి యూత్ క్లబ్ అధ్యక్షునిగా ఆయన ఎనలేని సేవ చేశారు. పండుగ వచ్చిందంటే చాలు ఆటల పోటీలు నిర్వహించడం యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం చేపించి మండల స్థాయి పోటీలు సైతం నిర్వహించాడు.
దానితోపాటు 1991 మే 21వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ పై మానవ బాంబు పేలి చనిపోవడంతో తీవ్రమైన భావోద్వేగానికి లోనైన సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల కేంద్రంలో బందు పాటించేలా చర్యలు తీసుకొని రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టుకున్నారు. అనంతరం గ్రామ,
మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఆ తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ గొడవలతో పెద్ది సుదర్శన్ రెడ్డిని నల్లవెల్లి బస్టాండ్ సమీపంలో కొట్టడానికి వస్తున్నారని నెపంతో హనుమకొండకు వెళ్లి కాంగ్రెస్ ఉద్దండులైన ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బసవరాజ్ సారయ్య, ఇంకా కాంగ్రెస్ నాయకుల ఇండ్లలోనే ఉంటూ రాజకీయాన్ని ఆకలింపు చేసుకున్నాడు. ఒక దశలో ఎమ్మెల్యే ఎంపీలకు వచ్చు సమస్యలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన మార్గం గృహత్తరంగా పనిచేస్తుందని ఈయన సలహాల కోసం సూచనల కోసం అప్పటి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు క్యు కట్టేవారని పలువురు స్నేహితులు వాపోతున్నారు.
అప్పటి టిఆర్ఎస్ పార్టీకి పునాది రాయి పెద్ది
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే మండల స్థాయి నాయకుల చొరవతో ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన
జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్లబెల్లిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేం
నరేందర్ రెడ్డి పైన విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గా వాటర్‌షెడ్ నిధులతో భూగర్భ జలాల పెంపుతో పాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేశారు.
జడ్పీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తూ జడ్పీ చైర్మన్ బర్తరప్ లో అన్ని తేనై బర్తరఫ్ చేయించాడు.
2004లో పొత్తులో భాగంగా నర్సంపేట స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కంభంపాటి లక్ష్మారెడ్డి
పోటీ చేశారు. ఈయన విజయానికి పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి చేశారు.
2004 డిసెంబర్ లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు.
2005 లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నర్సంపేట
నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుపు కోసం ఆ ఎన్నికల్లో పెద్ది కృషి చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి 2013 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి వ్యవహరిస్తూ వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు.
ఉమ్మడి జిల్లాకు దిక్సూచి పెద్ది ఉద్యమం
2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది క్రమక్ర
మంగా పార్టీకి దూరమయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో జిల్లా కన్వీనర్
వ్యవహరించిన వారు స్తబ్దుగా ఉండిపోయారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా
పార్టీని వీడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ
దళానికి నేతృత్వం వహించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు.
2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తూ కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపు పొందారు. చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్‌లో నిర్వహించిన మహా గర్జన సభకు పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి నే ప్రాతినిధ్యం వహించారు.
కెసిఆర్ కుటుంబ సభ్యుడిగా పెద్ది
ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరాహార దీక్ష, ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ
ఉద్యమంలో పెద్ది కీలకంగా వ్యవహరించారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులకు
టీఆర్ఎస్ తరఫున అన్ని సమయాల్లో అందుబాటులో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం
కీలకంగా ఉన్న సమయంతోపాటు తెలంగాణ ఆవిర్భావం వరకు జరిగిన అన్ని సంద
ర్భాల్లోనూ జిల్లాలో ఆయన టీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఏక కాలంలో
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. వరం
గల్ పశ్చిమ, స్టేషనఘన్పూర్, పరకాల నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో
టీఆర్ఎస్ గెలుపు కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమం,
టీఆర్ఎస్ కీలక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో
నర్సంపేటలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఓటమి చెందడం ఆయనను కుంగదీసింది. సుదర్శన్ రెడ్డికి కెసిఆర్ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం తో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కకపోయినా ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల పర్యటనలు కొనసాగించారు.
ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి బలమైన పునాదిగా మారింది. కెసిఆర్ సొంత కుటుంబంలో సభ్యుడిగా కొనసాగుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కెసిఆర్ పిలిచి రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్‌గా పదవి బాధ్యతలు అప్పగించి ఆ చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పెద్ది వ్యవహరించడంతో అందరి మన్ననలు పొందాడు. ఈ నిరంతర కృషే 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీపై పోటీ చేసిన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై సుదర్శన్ రెడ్డి గెలుపొందారు.
2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు
2018లో నర్సంపేట ప్రజలు ఆయనను తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఇది కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు; ప్రజల మధ్య సంవత్సరాలుగా నిర్మించుకున్న విశ్వాసానికి లభించిన గుర్తింపు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. ప్రజాదర్బార్లు, గ్రామ పర్యటనలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తాగునీరు, గ్రామీణ రహదారులు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అంశాలు ఆయన ప్రజా చర్చల్లో తరచుగా ప్రాధాన్యం పొందాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. అది నర్సంపేట నియోజకవర్గ సామాజిక, రాజకీయ పరిణామాలతో ముడిపడిన ప్రయాణం. ప్రజలతో కలిసి నడుస్తూ, వారి సమస్యలను తన బాధ్యతగా భావించిన నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.
సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు.
గుండెపోటుతో తీవ్రత గురై చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి కి కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు అండగా నిలుస్తూ వైద్య సేవలు అందేవిధంగా కృషి చేశారు… అధికార పార్టీ నేతలు.. మంత్రులు సీతక్క పొంగులేటి ఇతర నేతలు సైతం అయనకోలుకోవాలని పార్ధించారు…అయిన ఫలితం లేకపోయింది గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు.
పెద్ది బ్రెయిన్ మెమొరీ పెద్దది
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేరు ఎన్నికైన వ్యక్తిగా ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు. ఆండ్రాయిడ్ ఫోన్లు రాకముoదు ఉద్యమకాలంలో డబ్బా ఫోన్లు వాడుతున్నప్పటికీ మండల నియోజకవర్గ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ల్యాండ్ ఫోన్ లను అదేవిధంగా డబ్బా ఫోన్ నెంబర్లను ఒక 1000 వరకు పలాన వ్యక్తి అని గుర్తించడమే కాకుండా నాలుగపై నడియాడేటివి అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ప్రతి ఒక్క వ్యక్తి 50 ఫోన్లు గుర్తుంచుకోవడమే గగనమవుతున్న ఈనాటి రోజుల్లో సైతం ఆయన 1000 ఫోన్ నెంబర్లను అవలీలగా నోటికి చెప్పేవాడని అంత బ్రెయిన్ ఉన్న వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడు అంటే నమ్మలేకపోతున్నామని కుటుంబ సభ్యులు స్నేహితులు ఉద్యమకారులు , ఉద్యమ గురువులు కార్యకర్తలు నాటి స్మృతులను గుర్తు చేసుకొని మనోవేదనకు గురవుతున్నారు.
