- ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై మూడు జిల్లాల్లో 12 ప్రాంతాల్లో తనిఖీలు
నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ఒకేసారి మూడు జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, డిపాజిట్లు, లాకర్లు, ఇతర ఆర్థిక వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటించిన ఆదాయం, ఆస్తులతో పోలిస్తే గుర్తించిన ఆస్తుల విలువలో వ్యత్యాసం ఎంత ఉందన్న అంశాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. డాక్టర్ లక్ష్మీభాస్కర్‌కు సంబంధించి గతంలో భూ లావాదేవీలు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై ఆరోపణలు, కేసులు ఉన్నట్లు సమాచారం.

అయితే వాటి పూర్తి వివరాలు, ప్రస్తుత ఏసీబీ సోదాలకు(ACB Raid) వాటితో ఉన్న సంబంధంపై అధికారులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల పత్రాలు, ఇతర కీలక ఆధారాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ ఈ సోదాలు(ACB Raid) నిర్వహిస్తోంది.
ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (DAO)గా పనిచేస్తున్న దేశాని శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులపై వచ్చిన సమాచారంతో చేపట్టిన ఆ సోదాల్లో హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో జి+3 పెంట్‌హౌస్, రెండు ఫ్లాట్లు, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, నల్లవెల్లి గ్రామంలో పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీటి డాక్యుమెంట్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్ విలువ సుమారు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
అలాగే బాలాపూర్‌లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల విలువైన భాగస్వామ్య వాటా, రూ.4 లక్షల నగదు, రూ.8.60 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 680 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
