- మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు
- చైర్మన్ శ్రీదేవి రమేష్,కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్
దశలవారీగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ తెలిపారు. బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ వార్డులో చాలా కాలంగా స్థానికులు ఎదుర్కొంటున్న మురుగు నీటి సమస్యకు ఈ డ్రైనేజీ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
డ్రైనేజీ వ్యవస్థ పూర్తయిన తర్వాత వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే పరిస్థితులు తగ్గడంతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్థానిక ప్రజలు కూడా డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రజిత దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అర్చనా శ్రీనివాస్, శ్రీలత రమేష్, మలోత్ రజిత రాజేందర్ నాయక్, వరలక్ష్మి సురేందర్, వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
