Homeహైదరాబాద్‌Encroachment | ప్రభుత్వ భూమిపై భవన నిర్మాణం..

Encroachment | ప్రభుత్వ భూమిపై భవన నిర్మాణం..

  • పాత నివేదికకు భిన్నంగా కొత్త నివేదిక..?

శేర్లింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ గ్రామంలోని సర్వే నంబర్ 151 (రేగుల కుంట) భూమి వ్యవహారంలో అధికారుల నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉండటంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ ఆక్రమణలు జరిగినట్లు నివేదిక సమర్పించిన అధికారులు, ప్రస్తుతం అదే భూమి ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ మరో నివేదిక ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

2020లో ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాలతో సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గ్రామ పటాలు, డీజీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన సర్వేలో హఫీజ్‌పేట్ గ్రామంలోని సర్వే నంబర్ 151 (రేగులకుంట) ప్రభుత్వ భూమిలో సుమారు 1,202 చదరపు గజాల మేర సర్వే నంబర్ 150కు చెందిన ప్లాట్ల యజమానులు ఆక్రమణకు పాల్పడినట్లు అప్పటి సర్వే డిప్యూటీ సమగ్ర నివేదిక సమర్పిం చారు. ఆక్రమణలను చూపిస్తూ ప్రత్యేక రేఖాచిత్రాన్ని కూడా అధికారులకు అందజేశారు.

- Advertisement -

అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కొనసాగుతుండగా, రాజేంద్రనగర్ రెవెన్యూ కార్యాలయానికి చెందిన మరో సర్వేయర్ ఈ భూమి ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ కొత్త నివేదిక సమర్పించినట్లు సమాచారం. దీంతో ఒకే భూమిపై ఒకే శాఖకు చెందిన అధికారులు భిన్నమైన నివేదికలు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే శాఖకు చెందిన సర్వేయర్లు ఒకే భూమిపై రెండు భిన్నమైన నివేదికలు ఇవ్వడం ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తోందని ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదని పేర్కొనడం వెనుక కారణాలేమిటో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిగా గుర్తించిన ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణాలు ఎలా కొనసాగుతు న్నాయి? కొత్త నివేదిక ఏ ఆధారాలతో ఇచ్చారు? పాత సర్వే నివేదికను ఎందుకు పక్కన పెట్టారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంపై ఉన్న తాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News