- ఎంజేపీ పాఠశాలలో వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన.
- ఎంజేపీ పాఠశాల ఆకస్మిక తనికి చేసిన నిర్మల్ ఎమ్మెల్యే.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు కల్పించడమే లక్ష్యమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, వారికి వడ్డిస్తున్న భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా ఆరా తీశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, వసతి, రోజువారీ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని ఒక గదిలో 25 మంది విద్యార్థులు ఉండాల్సి వస్తోందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంజేపీ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తానని తెలిపారు.

పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆకస్మిక తనిఖీతో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించే అవకాశం లభించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, శశాంక్, సూరి, అర్జున్, సాత్విక్, విఠల్, నరేష్, బీజేపీ నాయకులు రాచకొండ సాగర్ , జమాల్, నారాయణ గౌడ్, కందుల హరీష్, భరత్, తో పాటు పట్టణ బీజేపీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
