Saturday, July 4, 2026
HomeతెలంగాణHyderabad Metro | పీక్ అవర్స్ లో రద్దీ..

Hyderabad Metro | పీక్ అవర్స్ లో రద్దీ..

  • ప్రయాణికులకు తప్పని నిరీక్షణ..
  • ఇంకో రెండేళ్లు ఆగక తప్పని పరిస్థితులు..

హైదరాబాద్ మెట్రోలో రద్దీ సమయాల్లో ప్రయాణించే వారికి నిరీక్షణ తప్పేలా లేదు. రైళ్లలో రద్దీ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశాలు కనిపించడం లేదు. కొత్తగా 60 కోచ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సుమారు రెండేళ్ల పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.

మెట్రో ఫేజ్-1 నిర్వహణను కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఈ బదిలీ పూర్తయ్యాకే కొత్త కోచ్‌ల కోసం ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, కేంద్రం నుంచి వచ్చిన తాజా ఆదేశాలతో ప్రతిపాదన నిలిచిపోయింది. మెట్రో ప్రాజెక్టు విలువను మరోసారి అంచనా వేయాలని కేంద్రం ఆదేశించడంతో కోచ్‌ల కొనుగోలుతో పాటు ఇతర కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.

- Advertisement -

ప్రస్తుతం ఎస్‌బీఐ క్యాప్స్ సంస్థ ఈ వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇది పూర్తవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టవచ్చని, పూర్తి స్థాయి బదిలీ ప్రక్రియ 2026 చివరి నాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కు కోచ్‌ల తయారీ కోసం ఆర్డర్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఆర్డర్ అందిన తర్వాత కోచ్‌ల తయారీ, సరఫరాకు కనీసం 15 నెలల సమయం పడుతుందని సదరు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, నాగోల్-రాయదుర్గం, ఎల్బీ నగర్-మియాపూర్ వంటి మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, బదిలీ ప్రక్రియలోని సాంకేతిక అడ్డంకులు తొలగి కొత్త కోచ్‌లు అందుబాటులోకి వచ్చే వరకు ప్రయాణికులకు రద్దీ కష్టాలు తప్పేలా లేవు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News