- అమెరికా మీడియా కథనాలను ఖండించిన ఇజ్రాయెల్..
- స్పష్టం చేసిన బెంజామిన్ నెతన్యాహు కార్యాలయం..
శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్ కీలక నేతలను ఇజ్రాయెల్ సైన్యం హత్య చేయాలనుకున్నట్లు అమెరికా మీడియా ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళిక వేసుకుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా.. ఇరాన్‌కు సమాచారం అందించిందని న్యూయార్క్ టౌమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే ‘ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధులపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేదు’ అని ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ స్పందించింది.
ఏప్రిల్‌లో ప్రారంభమైన శాంతి చర్చల సమయంలో ఇరాన్ నేతలపై దాడి జరిగితే చర్చలు పూర్తిగా భగ్నమవుతాయని అమెరికా భావించిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ కథనం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో ఇజ్రాయెల్ స్పందించాల్సి వచ్చింది.
