- కాంగోలో పరిస్థితి విషమం..
- వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ..
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు నిర్ధారిత ఎబోలా కేసుల సంఖ్య 782కు పెరిగింది. 181 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని ఆదివారం (జూన్ 14) సాయంత్రం సోషల్ మీడియా వేదిక Xలో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. మరో 56 మంది రోగులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, వాస్తవ కేసుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఎబోలా వ్యాప్తి ప్రారంభమైనట్లు అనుమానించిన కొన్ని వారాల తరువాతే, మే 15న మొదటి కేసు అధికారికంగా నిర్ధారణ కావడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అదేవిధంగా, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కూడా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత వారంతో పోలిస్తే కాంటాక్ట్ ట్రేసింగ్ కవరేజ్ 56 శాతానికి పడిపోవడం అధికారులను మరింత కలవరపెడుతోంది.
ఈసారి ఎబోలా వ్యాప్తికి కారణమైన వైరస్ ‘బుండిబుగ్యో’ రకం. గతంలో కాంగోలో నమోదైన చాలా ఎబోలా వ్యాప్తులకు కారణమైన ‘జైర్ వైరస్’తో పోలిస్తే, దీనికి ప్రస్తుతం ఆమోదిత టీకా, ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం ఈ వ్యాప్తిలో మరణాల రేటు 23 శాతంగా నమోదైంది. ఈ కేసుల్లో 90 శాతానికి పైగా కాంగో తూర్పు ప్రాంతంలోని ఇటూరి ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. ఉత్తర కివు, దక్షిణ కివు ప్రావిన్సులకు కూడా వైరస్ వ్యాపించింది. అంతేకాకుండా సరిహద్దు దాటి ఉగాండాలోనూ కొన్ని కేసులు నమోదవడం అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది.
