- విషాదం నింపిన సంఘటన..
- సిద్ధిపేట జిల్లాలో వెలుగుచూసిన ఘటన..
అందాల నెమళ్లకు నిలయమైన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నెమళ్ళు మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది.. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా నంగునూరు (మం) కొండరాజుపల్లి గ్రామ పరిధిలోని ఏనుగురాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.
ఒకే చోట ఐదు జాతీయ పక్షులు జీవం లేకుండా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఐదు నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించారు. అనంతరం వాటిని అదే ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
అయితే, ఈ పక్షుల మరణాలపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషపు గింజలు చల్లడం వల్ల ఈ నెమళ్లు మృతి చెందాయా? లేక ఏదైనా గుర్తుతెలియని వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయా? అనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మూగజీవాల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంచనామా రిపోర్ట్ ప్రకారం.. చర్యలు తీసుకోనున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
