- మడకశిరకు సమీపంలోని అమరాపురం మండలంలో వెలసిన టెంపుల్..
- అతి ప్రాచీన నిర్మాణ శైలి, అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం..
సాధారణంగా పరమశివుడు అన్ని ఆలయాల్లో లింగాకారంలోనే దర్శనమివ్వడం సహజం. ఇటు జ్యోతిర్లింగాల మొదలుకొని పంచారామ క్షేత్రాల్లోనూ, పంచభూత క్షేత్రాల్లోనూ కూడా శివుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. అయితే అత్యంత అరుదుగా హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంలో శివుడు మనవాకారంలో దర్శనమిస్తారు.
ఆదియోగి అయిన పరమేశ్వరుడు లింగాకారంలో కాకుండా మానవాకారంలో కొలువై ఉండగా, నిలువెత్తు స్వామి రూపంతో పాటు మరో నాలుగు శివలింగాలు కొలువైన ఈ పంచలింగ శైవక్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో చూద్దాం.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరకు సమీపంలో అమరాపురం మండలం హేమావతి గ్రామంలో కొలువైన ఈ పంచలింగాల క్షేత్రం హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అతి ప్రాచీన నిర్మాణ శైలితో, అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యంతో దాదాపు 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయం దేశంలోని అరుదైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో సిద్ధయోగిగా దర్శనమివ్వడం విశేషం.
పూర్వం ఈ ప్రాంతం పేరు హేంజేరుగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే నొళంబ పల్లవ రాజుల కులదైవం పరమేశ్వరుడు. ఈ వంశానికి చెందిన చిత్రశేఖర, సోమశేఖర అనే సోదరులకు చాలాకాలం సంతానం లేకపోవడంతో వారు తమ కులదైవమైన శివుని పూజించగా ఒకసారి శివుడు వారికి కలలో కనిపించి, తనను పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, సంతానం కలిగాక తనకు లింగాకారంలో కాకుండా మానవాకారంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట! ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ వంశంలో ఒక ఆడపిల్ల జన్మించడంతో ఆ పాపకు హేమావతి అని పేరు పెట్టి శివాజ్ఞ ప్రకారం శివాలయం నిర్మించి మానవాకారంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట!
