Tuesday, April 14, 2026
Homeరంగారెడ్డిCelebration | అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Celebration | అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

జవహర్ నగర్ మహానగర పరిధిలో బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మహనీయుల ఉత్సవాల కమిటీ, బాబు జగజీవన్ రామ్ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కళ్లెపల్లి సదానందం, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ హాజరయ్యారు. బాలాజీ నగర్, న్యూ దేవేంద్ర నగర్, అంబేద్కర్ నగర్, కేఎన్ఆర్ నగర్ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానీయుడి సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహనీయుల ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు మండల సురేందర్, మొగిలి పాక పర్శారం, ఎర్రగుడ్ల వెంకటేష్, బల్లి శ్రీనివాస్ గుప్త, కుతడి సాయి, పానుపాటి రాజయ్య, మంద ఆనంద్, గడిపే సునీల్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి స్వేచ్ఛ, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ప్రపంచంలోని పలు రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగంలో ప్రజలకు అవసరమైన ప్రాథమిక హక్కులను పొందుపరిచారని తెలిపారు.

- Advertisement -

దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి అపూర్వమని అన్నారు. భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పదెనిమిది రోజులు సమయం పట్టిందని, ఆ కాలంలో ఆయన చేసిన త్యాగాలు అమూల్యమని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం సాధించేందుకు పునాది వేశారని పేర్కొన్నారు.

ఆర్టికల్ 15, 16, 340 ద్వారా బలహీన వర్గాల రక్షణకు మార్గం సుగమం చేశారని తెలిపారు. కులవ్యవస్థ నిర్మూలన కోసం, సమాజంలో సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News