- తిరుమలగిరి(జి)లో మండల సిహెచ్‌ఓ నిర్వాకం
- అసభ్య పదజాలంతో ఆరోగ్య కేంద్రంలో హంగామా
- వీడియో తీసి జిల్లా ఉన్నతాధికారులకు పంపిన సిబ్బంది
- సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసిన జిల్లా అధికారులు
చివ్వెంల మండల పరిధిలోని తిరుమలగిరి(జి) మండల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిపై, అదే శాఖలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిహెచ్‌ఓ ఆవుల వెంకటేశ్వర్లు మద్యం మత్తులో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దాడి చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తిరుమలగిరిలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్, సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉపకేంద్రానికి చేరుకుని, మహిళ ఉద్యోగిని విధుల్లో ఉన్నదని కూడా పట్టించుకోకుండా ఆమెపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడుతూ అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిపారు. ఈ ఘటనను అక్కడే ఉన్న సిబ్బంది, గ్రామస్తులు ప్రత్యక్షంగా చూశారని, జరిగిన సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియోగా చిత్రీకరించి జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం.
విధుల్లో మద్యం సేవించి అసభ్య ప్రవర్తనతో
సిహెచ్ తక్షణ సస్పెన్షన్..
చివ్వెంల మండలం పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్ సి) కింద విధులు నిర్వహిస్తున్న సిహెచ్‌ఓ ఆవుల వెంకటేశ్వర్లు విధుల సమయంలో మద్యం సేవించి, మహిళా ఆరోగ్య కార్యకర్తతో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అత్యంత గంభీరంగా పరిగణించారు.గుంపుల తిరుమల గిరి ఉప కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అంద డంతో, సంబంధిత అధికారిని విధుల నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ వైద్య సేవలలో పనిచేసే ఉద్యోగులు విధుల సమయంలో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. వైద్య శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎలాంటి అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇలాంటి ఘటనల పట్ల శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం చూపబోదని డాక్టర్ పెండెం వెంకటరమణ హెచ్చరించారు.ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత ఉద్యోగిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడిరచారు.
