Homeఆదాబ్ ప్రత్యేకంWaqf Land | వక్ఫ్ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యం.. (పార్ట్ - 1)

Waqf Land | వక్ఫ్ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యం.. (పార్ట్ – 1)

  • 35 ఏళ్ల క్రితమే గెజిట్‌లో నమోదైన దర్గా భూములకు రక్షణ ఏదీ..?
  • 45 ఎకరాలకుపైగా భూమిలో కేవలం 1 ఎకరం 16 గుంటలకే సర్వే పరిమితమా?
  • కలెక్టర్ ఆదేశాలు, వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు ఉన్నా చర్యలేవీ?
  • తిరుమలగిరి తహసీల్దార్, జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్‌పై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి!

వక్ఫ్ భూముల(Waqf Land) పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. కానీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, మలిపురం గ్రామంలోని దర్గా హజ్రత్ బుర్హానుద్దీన్ షావలి రహమతుల్లాహ్ భూముల విషయంలో అధికారుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ లేఖలు, ఆర్టీఐ దరఖాస్తులు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణలు జరిగినప్పటికీ, మొత్తం భూములకు సంబంధించి సమస్యకు పరిష్కారం లభించలేదని సంబంధిత పత్రాలు వెల్లడిస్తున్నాయి.

1990 గెజిట్‌లోనే వక్ఫ్ భూముల నమోదు : మలిపురం గ్రామంలోని దర్గా హజ్రత్ బుర్హానుద్దీన్ షావలి రహమతుల్లాహ్‌కు సంబంధించిన భూములు 1990 మార్చి 1న ప్రచురితమైన ఆంధ్రప్రదేశ్ గెజిట్ నంబర్ 9-ఏలో, సీరియల్ నంబర్ 15136 కింద నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం, సర్వే నంబర్లు 281, 115, 116, 118, 279, 30, 31లో కలిపి పొడి భూమి 38 ఎకరాల 2 గుంటలు, తడి భూమి 7 ఎకరాల 15 గుంటలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 45 ఎకరాల 17 గుంటలు. ఇంత విస్తీర్ణంలో ఉన్న భూములకు సంబంధించి హద్దుల గుర్తింపు, ఆక్రమణల నిర్ధారణ, భూముల రక్షణ వంటి అంశాలపై అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

- Advertisement -

2022లోనే వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు : వక్ఫ్ భూముల(Waqf Land) సర్వే, హద్దుల నిర్ధారణ, ఆక్రమణల గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు 2022 నవంబర్ 10న ఎఫ్.నెంబర్ : 04/పీ ఆర్ ఓ టి / సూర్యాపేట/ 2022/జెడ్ – 3 నంబరుతో కార్యాలయ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత వక్ఫ్ అధికారులు, సర్వేయర్, రెవెన్యూ అధికారుల సమక్షంలో సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఈ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా మొత్తం భూముల సమస్య పరిష్కారం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో వక్ఫ్ భూములుగా నమోదైన స్థలాలను కాపాడటంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో సంబంధిత శాఖలు సమాధానం చెప్పాలి.

ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన అంశాలు : డా.మొహమ్మద్ అతర్ నవాబ్, ఆర్టీఐ కార్యకర్త, ఈ వక్ఫ్ భూముల వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద 2025 అక్టోబర్ 30న దరఖాస్తులు సమర్పించి, వక్ఫ్ బోర్డు ఉత్తర్వుల అమలు, భూముల సర్వే, ఆక్రమణలపై తీసుకున్న చర్యల వివరాలను కోరారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాల నుంచి కోరిన సమాచారం అందకపోవడంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ విచారణ అనంతరం సర్వే నంబర్ 281లోని 1 ఎకరం 16 గుంటల భూమికి సంబంధించి సంయుక్త సర్వే నిర్వహించి నివేదిక సమర్పించినట్లు సంబంధిత పత్రాలు, దరఖాస్తుదారు వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన భూముల పరిస్థితి, పట్టాదారు పాస్‌బుక్కులు, ఓఆర్‌సీల జారీకి సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం డా. మొహమ్మద్ అతర్ నవాబ్ చేస్తున్న ఆర్టీఐ ప్రయత్నాలతో ఈ వ్యవహారం అధికారిక విచారణల దశకు చేరింది.

మిగిలిన భూములపై పట్టాదారు పాస్‌బుక్కులు, ఓఆర్‌సీ ఎలా? : దరఖాస్తుదారు తెలిపిన వివరాల ప్రకారం, సమాచార కమిషన్ విచారణ సమయంలో మిగిలిన భూముల ఆక్రమణల అంశం ప్రస్తావనకు వచ్చింది. కొన్ని భూములకు పట్టాదారు పాస్‌బుక్కులు జారీ అయ్యాయని, మరికొన్ని భూములకు ఓఆర్‌సీ పొందినట్లు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ వివరాలు నిజమైతే, సంబంధిత భూములపై హక్కులు ఏ ఆధారాలతో కల్పించారు? అవి వక్ఫ్ రికార్డులతో సరిపోలుతు న్నాయా? భూముల స్వభావం, హద్దులు, యాజమాన్య హక్కు లను పరిశీలించకుండా ఏమైనా రెవెన్యూ రికార్డులు జారీ చేశారా? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరం. వక్ఫ్ భూములుగా గెజిట్‌లో నమోదైన స్థలాలకు సంబంధించి పట్టాదారు పాస్‌బుక్కులు లేదా ఓఆర్‌సీలు జారీ అయ్యాయన్న ఆరోపణలను అధికారులు రికార్డుల ఆధారంగా స్పష్టం చేయాలి. ఆరోపణలు నిజమని తేలితే, చట్టప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. (మిగతా కథనం పార్ట్ – 2లో)(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News