- సంచలన ఆరోపణలు చేసిన హరీష్ రావు..
- టోమ్ కామ్ ఒక్కొక్కరి దగ్గర రూ. 4పైగా వసూలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ ఆధ్వర్యంలోని టోమ్కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ) నిరుద్యోగ యువతను దోచుకునే ఓ పెద్ద రాకెట్గా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. జర్మనీలో ఉద్యోగాల పేరు చెప్పి 70 మందికి పైగా యువకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, వారిని నట్టేట ముంచారని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హరీశ్ రావు(Harish Rao) ఆరోపణల ప్రకారం, సుమారు 15 జిల్లాల నుంచి 70-75 మంది నిరుద్యోగ యువకుల నుంచి టోమ్కామ్ ఒక్కొక్కరి దగ్గర రూ.4.10 లక్షల చొప్పున వసూలు చేసింది. పరీక్షలు, ఇన్సూరెన్స్, వీసా ఖర్చులతో కలిపి ఇది ఒక్కో అభ్యర్థికి దాదాపు రూ.4.5 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. పేద రైతు కుటుంబాలకు చెందిన వారు తమ ఇంట్లోని మహిళల బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఈ డబ్బు కట్టారని, రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో ఇంకా వడ్డీలు చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్లు దాటినా, బాధితుల్లో ఒక్కరిని కూడా ఒక్క జర్మన్ కంపెనీ కూడా ఇంటర్వ్యూ చేయలేదని హరీశ్ రావు తెలిపారు. జర్మన్ భాషలో బీ1 పరీక్ష పాసైన వారిని, ఇప్పుడు బీ2 పాస్ కావాలని చెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వీరిలో తొమ్మిది మంది జర్మనీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ టోమ్కామ్ ప్రచారం చేసుకున్నా, ఒక్కరు కూడా వెళ్లలేదని స్పష్టం చేశారు.
ఈ అభ్యర్థులతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తితే 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో కోర్టులో తేల్చుకోవాలని నిబంధన పెట్టడం దారుణమని అన్నారు. టోమ్కామ్ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగినా, గడువు ముగిసినా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
