ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున స్టే ఇవ్వలేం
- స్టే లేదు, విచారణ 8 వారాలకు వాయిదా..
- బీసీలకు కావాలనే రిజర్వేషన్లు తగ్గించారు..
- హైకోర్టును ఆశ్రయించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సర్పంచ్ మరియు వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ దాఖలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే డిసెంబర్ 11న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టు ఎదుటకు చేరింది. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ ప్రజలకు కావాలనే రిజర్వేషన్ శాతం తగ్గించారని ఆరోపిస్తూ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ (37002/2025) వేశారు. ఇదే సమయంలో, వికారాబాద్‌కు చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం తరఫున ఎస్. లక్ష్మి సహా మరో ఆరుగురు కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవో-46ను సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ అన్ని పిటిషన్లను పరిశీలించిన చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొ?యుిద్దీన్ లతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలను చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, ఈ దశలో జీవో%-%46పై స్టే ఇవ్వడం అసాధ్యమని స్పష్టంచేసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే అది ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్టేనని కోర్టు అభిప్రాయపడిరది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం 6 వారాల్లో తమ కౌంటర్లు దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. అనంతరం, పిటిషనర్లు మరో రెండు వారాల్లో ప్రతిస్పందన కౌంటర్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా సమర్పించాలని సూచిస్తూ, విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
అదే సమయంలో, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం అత్తాపూర్‌కు చెందిన జి. రమేష్ గౌడ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌లో కూడా పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలనే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. జీవోపై స్టే ఇవ్వడం ఎన్నికల ప్రక్రియను విఘాతం కలిగించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి, ఎన్నికలు కేవలం వారం రోజుల దూరంలో ఉన్న నేపథ్యంలో, రిజర్వేషన్లపై దాఖలైన ఈ పిటిషన్లపై హైకోర్టు తీసుకునే తుది నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
