పొలాలను సందర్శించి నివేదిక ఇవ్వండి
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
కరీంనగర్, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): మొంథా తుఫాన్ (Cyclone) నష్టం అంచనాలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పొలాలను సందర్శించి పక్కాగా నివేదికలను తయారుచేయాలని సూచించారు. నష్టపోయిన రైతులందరినీ గుర్తించాలని కోరారు. అంచనా (Estimates) నివేదికలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని అన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ డీ రోడ్లు ఏ మేరకు మరమ్మతులకు గురయ్యాయో పరిశీలించి ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
తాత్కాలిక, శాశ్వత మరమ్మత్తులకు ఎంత ఖర్చవుతుందో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖలో దెబ్బతిన్న కరెంట్ పోల్స్(Current Poles), ట్రాన్స్‌ఫార్మర్ల (Transformers) వివరాలు అందించాలని తెలిపారు. నీటి పారుదల శాఖ పరిధిలో ధ్వంసమైన చెరువులు, కాల్వలు(Canals), నీటి వనరుల వివరాలను కూడా నివేదికల్లో పొందుపరచాలని అన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా సేకరించి నష్టపోయినవారికి పరిహారం చేరేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
