Homeకరీంనగర్MLA Madan Mohan | కరీంనగర్ టు పిట్లం రహదారి ని జాతీయ రహదారి గా...

MLA Madan Mohan | కరీంనగర్ టు పిట్లం రహదారి ని జాతీయ రహదారి గా మార్చాలి..

  • కేంద్ర మంత్రిలను కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్.

కరీంనగర్ నుంచి మొదలై కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు ఉన్న రాష్ట్ర రహదారిని వెంటనే జాతీయ రహదారిగా ప్రకటించి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం మీదుగా సుమారు 165 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని వివరించారు. మహారాష్ట్రతో అనుసంధానం మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగం, పర్యాటక రంగాలకు కూడా ఊతమిస్తుందని తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేకేవై (KKY) రహదారి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు చెప్పారు. అలాగే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌ను కలిసి ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఈ రహదారిని ఎన్‌హెచ్–563 (కరీంనగర్), ఎన్‌హెచ్–44 (కామారెడ్డి), ఎన్‌హెచ్–765డీ (ఎల్లారెడ్డి), ఎన్‌హెచ్–161 (పిట్లం) జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తే కీలక రవాణా కారిడార్‌గా మారుతుందని వినతిపత్రంలో వివరించినట్లు తెలిపారు.

ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించిందని, అవసరమైన సాంకేతిక నివేదికలు, గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ తదితర వివరాలను కూడా సమర్పించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పలుమార్లు కేంద్రానికి ఈ ప్రతిపాదనను సిఫారసు చేసిందని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు వెంటనే తుది ఆమోదం తెలిపి, కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం 165 కి.మీ. జాతీయ రహదారి పనులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News