కబ్జాదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూములు!
ఈ అక్రమ అనుమతుల వెనుక పట్టణ ప్రణాళిక డైరెక్టర్ స్థాయి అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, నిబంధనలను తుంగలో తొక్కి వీరు రియల్టర్లకు అండగా నిలిచారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- బాలానగర్ – కూకట్‌పల్లిలో సర్వే నంబర్ల ఓవర్‌ల్యాపింగ్
- బోగస్ రికార్డులతో భూ దందా.. రియల్టర్ల హస్తం?
- ఐడీపీఎల్ ప్రభుత్వ భూముల్లో హై-రైజ్ నిర్మాణాలు
- 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆరోపణలు
- డబ్బులకు అమ్ముడుపోయిన మాజీ ఏడీ శ్రీనివాసులు
- అక్రమ నిర్మాణాలపై ఈఓడబ్ల్యూ ఎఫఐఆర్‌లు
- సమగ్ర భూ సర్వే.. అక్రమ అనుమతుల రద్దుకు డిమాండ్
తెలంగాణలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో సుమారు రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ, పారిశ్రామిక భూములను బడా రియల్టర్లు, అవినీతి అధికారులు కలిసి కబ్జా చేసిన వైనం సంచలనం సృష్టిస్తోంది. బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సర్వే నంబర్ల అతివ్యాప్తి (ఓవర్‌లాపింగ్) మరియు నకిలీ రికార్డుల సృష్టి ద్వారా సాగుతున్న ఈ దందాపై హైకోర్టుతో పాటు జీహెచఎంసీ అధికారులకు ఫిర్యాదుల వెల్లువ కురుస్తోంది. ?”కావలివాడే పొలం మేసినట్లు” అన్న చందంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై విలువైన ఆస్తులను కొల్లగొడుతుండటం పాలకులకు కనువిప్పు కలిగించాల్సిన పరిణామం.
నకిలీ రికార్డులు.. అక్రమ నిర్మాణాల లీలలు
ఈ భూ కుంభకోణంలో అడుగడుగునా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయి. భూముల అతివ్యాప్తి (ఓవర్‌లాపింగ్): బాలానగర్ మండలం బాలానగర్ గ్రామ సర్వే నంబర్లు 27, 28, 29, 30 భూములు.. కూకట్‌పల్లి మండలం మూసాపేట గ్రామ సర్వే నంబర్లు 210/2, 210/3 లతో అతివ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.

భూమి లేకుండానే పట్టాలు:
మూసాపేట సర్వే నంబర్లు 210/2, 210/3 లలో అసలు భౌతికంగా భూమి లేనప్పటికీ, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బోగస్ పత్రాలను సృష్టించారు. మైలాండ్ టెక్నాలజీస్, తిరురూప రియాల్టర్స్ వంటి సంస్థలు ఈ భూములను కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డాయి.
ఐడీపీఎల్ భూముల ఆక్రమణ: మూసాపేట సర్వే నంబర్ 210/1 ప్రభుత్వ భూమి మరియు 210/4 పూర్తిగా ప్రభుత్వ నిషేధిత జాబితాలోని ఐడీపీఎల్ భూమి. కానీ, ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే హై-రైజ్ భవనాల నిర్మాణాలు (16 బ్లాకులు) పూర్తి విస్తీర్ణం 72,842 చదరపు మీటర్లలో జోరుగా సాగుతున్నాయి. జీహెచఎంసీ నుంచి మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ డాక్టర్ ఎం. సచ్చిదానంద రావు బాలానగర్ మండలంలో ‘హోమ్‌ల్యాండ’ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారు. జీహెచఎంసీ నుంచి తీసుకున్న అనుమతులు సర్వే నంబర్లు 210/2, 210/3 కాగా, నిర్మాణం మాత్రం 210/1, 210/4 ప్రభుత్వ భూమిలో సుమారు 19 ఎకరాలు ఆక్రమించి చేపడుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇప్పటికే దీనిపై ఐడీపీఎల్ ఎస్టేట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఎఫఐఆర్‌లు కూడా నమోదు చేశారు.
అధికారుల అండదండలతోనే జోన్ మార్పిడి?
ఈ భారీ కుంభకోణం వెనుక కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రియల్ జోన్‌గా ఉన్న భూమిని నివాస ప్రాంతంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఈ దందాను మరింత సులువు చేశాయి.
జీవో జారీలో మతలబు: జూలై 10, 2024న జారీ అయిన జీవో ద్వారా మూసాపేట సర్వే నంబర్లలోని భూములను ఇండస్ట్రియల్ నుండి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది.
అధికారుల పాత్ర: ఈ అక్రమ అనుమతుల వెనుక పట్టణ ప్రణాళిక డైరెక్టర్ స్థాయి అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, నిబంధనలను తుంగలో తొక్కి వీరు రియల్టర్లకు అండగా నిలిచారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ?”ఉప్పు అమ్మేవాడికి, కర్పూరం అమ్మేవాడికి తేడా తెలిసినట్లే”.. అవినీతికి, నిజాయితీకి తేడా తెలిసిన కొందరు ఉన్నతాధికారులు నిబంధనలను అడ్డుపెట్టి అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తుండటం గమనార్హం.

విచారణ మరియు తక్షణ డిమాండ్లు
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన జీహెచఎంసీ, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు అత్యవసర లేఖ రాశారు. సర్వే నంబర్ల వాస్తవ పరిస్థితిని తేల్చాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అమాయక గృహ కొనుగోలుదారులు మోసపోకుండా అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరపి నివేదిక సమర్పించాలని కోరారు.
- ప్రధాన డిమాండ్లు:
- సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంబంధిత సర్వే నంబర్‌లపై సమగ్ర సర్వే జరపాలి.
- అక్రమ అనుమతులు మంజూరు చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
- వివాదం తేలే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త అనుమతులు ఇవ్వరాదు. నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయా లని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.
”ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, ఇల్లలకడానికి ఇంకొడు వాసాలు పట్టుకుపోయాడట” అన్నట్లుగా.. ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ప్రజల సంపద తరలిపోతుంటే, కొందరు బాధ్యతాయుత అధికారులు మాత్రం అక్రమార్కులకు వత్తాసు పలకడం విచారకరం. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇకనైనా స్పందిస్తారా, లేక ఈ భారీ కుంభకోణం కూడా కాలక్రమేణా నీరుగారిపోతుందా అన్నది వేచి చూడాలి!
ప్రస్తుతం ఈ భూ కుంభకోణానికి సంబంధించి రియల్టర్లు మరియు అధికారుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలపై మరిన్ని వివరాలను త్వరలో వెలుగులోకి తేనుంది
