- కామారెడ్డి జిల్లా జై గౌడ ఉద్యమ అధ్యక్షుడు: రంగోల్ల మురళి గౌడ్
- బడుగు, బలహీన వర్గాల విముక్తి కోసం పోరాడిన సామాజిక వేత్తకు ఇచ్చే ఘన నివాళి ఇదే: ప్రజా సంఘాల విజ్ఞప్తి
వరంగల్ జిల్లా నూతనంగా ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి, సామాజిక విప్లవకారుడు ,మొఘల్ నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార నిర్మాత ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’ పేరును పెట్టాలని కామారెడ్డి జిల్లా జై గౌడమ ఉద్యమ అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వాలకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం కోసం తొలిసారిగా గళమెత్తిన గొప్ప సామాజిక నేత సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. కుల, మత వివక్ష లేని సమాజాన్ని కాంక్షిస్తూ.. పన్నుల భారం, నిరంకుషితత్వ పాలనతో నలిగిపోతున్న బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి పోరాటం చేసిన చారిత్రక ధీరుడని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ నేల ఖిలాషాపూర్ నుంచి ఉద్భవించి, ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు రగలించి , గోల్కొండ కోటపై జయకేతనం ఎగురవేసిన పాపన్న చరిత్ర భావితరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న గౌడ్ పేరును వరంగల్ ఎయిర్పోర్టుకు(Warangal Airport) పెట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాల పోరాటాలకు, ఆయన సామాజిక సంక్షేమ ఆశయాలకు తగిన గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వరంగల్ ఎయిర్పోర్టుకు ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా అధికారికంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
