Homeనిజామాబాద్‌Tadwai Farmers | ఎల్ నినో ప్రభావంతో ఎండుతున్న పంటలు..!

Tadwai Farmers | ఎల్ నినో ప్రభావంతో ఎండుతున్న పంటలు..!

  • చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెడుతున్న రైతులు..
  • ఆందోళనలో అన్నదాతలు.. తాడ్వాయి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతుల విజ్ఞప్తి

తాడ్వాయి: ఎల్ నినా ప్రభావంతో వర్షాలు కురవక, పంటలకు సరిపడా నీరు అందక తాడ్వాయి మండలంలోని పల్లెల్లో కరువు(Tadwai Farmers) ఛాయలు అలుముకుంటున్నాయి. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి చేతికి అందుతుందో లేదోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన యువరైతు తిర్లపురం సంజీవులు తన వరి పంటను కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలు వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వర్షాలు లేక, చెరువు నుంచి పంట పొలానికి రావాల్సిన నీరు అందకపోవడంతో వరి పంట ఎండిపోతోంది. దీంతో చేసేదేమీ లేక తనకున్న పరిమిత ఆర్థిక వనరులతో రెండు ట్యాంకర్ల నీటిని పొలానికి తెప్పించి పంటకు నీరు అందించాడు. అయినప్పటికీ ఆ నీరు పంట అవసరాలకు ఏమాత్రం సరిపోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

- Advertisement -

చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నానని సంజీవులు వేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు, అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించడం మరింత ఆర్థిక భారంగా మారుతోంది. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలోనూ నీరు అందకపోవడం రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. చెరువులు, బోర్లు, వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు నీటి కొరత(Tadwai Farmers) తీవ్ర సమస్యగా మారింది.

ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వరి పంటతో పాటు ఇతర పంటల దిగుబడులపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు, పెట్టుబడులు తిరిగి ఎలా చెల్లించాలనే ఆందోళన వారిని కలవరపెడుతోంది. పంటలు ఎండిపోతుండటంతో పలువురు రైతులు తీవ్ర నష్టాల భయంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి తాడ్వాయి మండలంలోని పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను గుర్తించి, సాధ్యమైన చోట సాగునీటి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని, తాడ్వాయి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం రైతుల దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని తాడ్వాయి మండల రైతులు వేడుకుంటున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News