- గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో మార్పులు..
- వలసదారులు యూఎస్ విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు..
- వెల్లడించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ..
అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్ ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ’ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్‌ఎస్ వివరణ ఇచ్చింది.
తాజా ప్రకటనలో డీహెచ్‌ఎస్ స్పందిస్తూ.. ఇదేమీ విస్తృతస్థాయి విధాన మార్పేమీ కాదని వెల్లడించింది. దరఖాస్తుదారుడు గ్రీన్‌కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తిచేయాలా..? స్వదేశానికి వెళ్లాలా..? అన్నదానిని ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనే అని పేర్కొన్నది. ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తుచేయడమే మే 21న ఇచ్చిన మార్గదర్శకాల ఉద్దేశమని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సమయంలో కూడా వారు యూఎస్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది.
వీసా ఓవర్‌స్టేలు, ఇమిగ్రేషన్‌కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం తాము పరిగణనలోకి తీసుకుంటామని సూచనప్రాయంగా వెల్లడించింది. డీహెచ్‌ఎస్ వివరణ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుందో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారంపై వలసదారుల్లో పలు ప్రశ్నలు మిగిలేఉన్నాయి.
