- అధిక వడ్డీల పేరుతో వేధింపులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- తాడ్వాయి ఎస్సై నరేష్ హెచ్చరిక
తాడ్వాయి: నకిలీ లోన్ యాప్‌ల(Fake Loan Apps) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి ఎస్సై నరేష్ సూచించారు. గుర్తుతెలియని, అనుమతిలేని లోన్ యాప్‌ల ద్వారా సులభంగా రుణాలు ఇస్తామని నమ్మించి, ఆ తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ రుణగ్రహీతలను వేధిస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని తెలిపారు. కొన్ని యాప్‌ల నిర్వాహకులు రుణాలు తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి పరువు తీస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే గుర్తింపు పొందిన సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలని, గుర్తుతెలియని యాప్‌లను నమ్మవద్దని సూచించారు. ఎలాంటి యాప్‌లకూ వ్యక్తిగత ఫొటోలు, కాంటాక్ట్స్, గ్యాలరీ వివరాలను యాక్సెస్ చేసే అనుమతులు ఇవ్వకూడదని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ సమాచారం వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని వేధింపులకు గురవుతున్న వారు భయపడకుండా సంబంధిత ఫోన్ నంబర్లను బ్లాక్ చేసి పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

అనవసర కాల్స్ నియంత్రణకు 1909 డీఎన్డీ సేవలను వినియోగించుకోవాలని, మొబైల్ నుంచి START 0 అని టైప్ చేసి 1909కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా లేదా 1909కు కాల్ చేసి ఈ సేవను యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు. సైబర్ ఆర్థిక మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై నరేష్ భరోసా ఇచ్చారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ అపరిచిత యాప్‌ల మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని తాడ్వాయి పోలీసులు విజ్ఞప్తి చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
