Homeమేడ్చెల్‌Government Land | ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల పర్వం!

Government Land | ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాల పర్వం!

జవహర్‌నగర్‌లో సర్వే నంబర్ 381…382.లో యథేచ్ఛగా నిర్మాణాలు?

కళ్లముందే కడుతున్నా రెవెన్యూ అధికారులకు కనిపించవా?

- Advertisement -

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ఎక్కడ?

అధికారుల మౌనం వెనుక మతలబేంటి?

ఉన్నతాధికారుల జోక్యం ఎప్పుడో?

ప్రభుత్వ భూములు (Government Land) అంటే ప్రజల ఆస్తి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాప్రా మండల పరిధిలోని జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సర్వే నంబర్ 381లో నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారా? లేక సంబంధిత అధికారుల అనుమతి, పరోక్ష సహకారం ఉందా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

నిర్మాణాలు ఒక్కరోజులో పుట్టుకొచ్చేవి కావు!

ప్రభుత్వ భూమిలో పునాదులు వేయడం, నిర్మాణ సామగ్రిని తరలించడం, గోడలు నిర్మించడం, పైకప్పులు వేయడం వంటి పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. మరి ఇంతకాలం ఈ నిర్మాణాలు అధికారుల దృష్టికి రాకపోవడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారా? ప్రభుత్వ భూములపై నిరంతరం నిఘా ఉందా? అక్రమ నిర్మాణాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

Jawaharnagar Government Land Construction

ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఎందుకు లేవు?

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భూమి స్వరూపాన్ని నిర్ధారించి, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సర్వే నంబర్ 381 —-382.విషయంలో అధికారులు ఇప్పటివరకు ఏమైనా పరిశీలన చేశారా? నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సేకరించారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.

అధికారుల మౌనం ఎందుకు?

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన సమయంలో అధికారులు మౌనం వహిస్తే ఆక్రమణదారులకు మరింత ధైర్యం వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట చిన్న నిర్మాణంగా ప్రారంభమైనది కాలక్రమంలో శాశ్వత భవనంగా మారితే, అనంతరం ఆ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

నేడు పునాది.. రేపు నిర్మాణం.. ఎల్లుండి ఆక్రమణ!

ప్రభుత్వ భూముల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అధికారులు నిర్మాణాలు ప్రారంభమైన దశలోనే స్పందిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములపై జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే నంబర్ 381లో భూమి స్వరూపాన్ని పరిశీలించి, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? లేక ప్రభుత్వ భూమిలోనే నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించడం అధికారుల బాధ్యత. అందువల్ల ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా రెవెన్యూ యంత్రాంగం స్పందిస్తుందా? లేక అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు వేచి చూస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News