సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని ఎర్రగట్టు తండాలో ఈ నెల 29న జరిగిన వేప చెట్టు వివాదంలో సంచలనం సృష్టించిన జంట హ*త్యల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆదివారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.డీఎస్పీ కథనం ప్రకారం…
మండలంలోని ఎర్రగట్టుతండాకు చెందిన మంద వెంకటేశ్వర్లు యాదవ్ (70) అదే గ్రామానికి చెందిన భూక్య సైదా నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు వివాదం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నదని ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో హతుడు వెంకటేశ్వర్లు కొంత మంది కూలీలను పిలిపించి వివాదాస్పదమైన వేప చెట్టును నరికించాడు.
ఈ విషయంపై నిందితుడు అయిన భూక్యా పెద్దబాబు తన తమ్ముడు భూక్యా రాము,తల్లి భూక్యా లక్ష్మి,తండ్రి సైదా నాయక్ ఇరువర్గాల మధ్య గొడవ జరిగిందని తెలిపారు.ఈ క్రమంలో భూక్యా పెద్ద బాబు ఆవేశంతో కోపోద్రిక్తుడై గొడ్డలితో మంద వెంకటేశ్వర్లు యాదవ్ ను తలపై బలంగా గొడ్డలి వేటు వేయడంతో అక్కడిక్కడే కుప్పకూలినట్లు తెలిపారు.
ప్రశ్నించాడనే తండ్రిపై కక్ష..ఆపై హ*త్య
క్షణికావేశంలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ పై హ*త్యకు పాల్పడ్డ భూక్యా పెద్ద బాబు,అతని తమ్ముడు రాములను వారి తండ్రి భూక్యా సైదా మందలించినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.అంతేకాకుండా ఈ విషయంపై వెంకటేశ్వర్లుకు మద్దతుగా ఉన్నాడనే కారణంతో హతుడైన సైదా నాయక్ పై కూడా అతడి కుమారులు ఆగ్రహం పెంచుకొని హ*త్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లుతో పాటు భూక్యా సైదా నాయక్ ను కూడా హ*త్య చేసేందుకు లక్ష్మి తన కుమారులకు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.వివాదం తీవ్రరూపం దాల్చడంతో దాడికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఈ ఘటనపై మేళ్లచెరువు పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 170/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 333, 103(1), 61(2) రెడ్విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.అరెస్టు చేసిన వారిలో ఎ1 భూక్యా రాము,ఎ2 భూక్యా పెద్దబాబు,ఎ3 భూక్యా లక్ష్మిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఎర్రగట్టు తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.హ*త్యకు ఉపయోగించిన గొడ్డలి,మొబైల్ ఫోన్ ను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మునగాల సీఐ డి.రామ కృష్ణ రెడ్డి,మేళ్ళచెరువు ఎస్సై నవీన్ కుమార్ లు, కోదాడ టౌన్ ఎస్ఐ ఏడు కొండలు, పోలీసులు పాల్గొన్నారు.
