ఒకే సర్వే నంబర్.. ఒకే డెవలపర్.. ఐదు భారీ భవనాలకు అనుమతులు..
- సర్వే నంబర్ 32లో వరుసగా 5 నిర్మాణ అనుమతులు..
- ఎలఆరఎస్-2020 నిబంధనల అమలుపై అనుమానాలు..
- వ్యవసాయ సేల్ డీడ్‌తో నివాస భవనాలకు అనుమతులా..?
- లేఅవుట్, ప్లాట్ సబ్‌డివిజన్ అనుమతులపై ప్రశ్నలు..
- 2025 ఆగస్టులో ఐదు ఫైళ్లకు అనుమతులపై కలకలం..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మైసమ్మగూడ ప్రాంతంలో వెలసిన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ అనుమతుల వ్యవహారం ఇప్పుడు స్థానిక రియల్టర్లు మరియు అధికారుల మధ్య తీవ్ర కలకలం రేపుతోంది. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం, నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా అనుమతులు మంజూరు చేసిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒకే డెవలపర్‌కు ఒకే సర్వే నంబర్లో ఏకంగా ఐదు భవనాలకు అనుమతులు జారీ కావడం వెనుక ఉన్న మతలబు ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఒకే డెవలపర్‌కు ఐదు అనుమతులు.. అనుమతుల పర్వంలో అనుమానాల నీడ : గతంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో, 2025 ఆగస్టు నెలలో ‘ఎం/ఎస్ బ్లూ బెల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ’ పేరుతో సర్వే నంబర్ 32లో స్టిల్ట్ ం 5 అంతస్తుల నివాస భవనాల నిర్మాణానికి సంబంధించి ఐదు వేర్వేరు ఫైళ్లకు అనుమతులు జారీ అయ్యాయి. ఒకే సర్వే నంబర్ కింద వరుసగా ఐదు భారీ నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వడంపై స్పష్టమైన సాంకేతిక, చట్టపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమతుల సమయంలో అధికారులు భూమి చట్టపరమైన స్థితిని ఏ స్థాయిలో పరిశీలించారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఎలఆరఎస్-2020 నిబంధనలకు తిలోదకాలు? : ఈ వివాదంలో ప్రధానంగా జి.ఓ.ఎం.ఎస్.నెం.131 (ఎల్.ఆర్.ఎస్.-2020) నిబంధనల అమలుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం 2020 ఆగస్టు 26 నాటి కటాఫ్ తేదీ అత్యంత కీలకం.
- ఆ తేదీ నాటికి సంబంధిత ప్లాట్లకు చట్టబద్ధమైన టైటిల్ లేదా సేల్ డీడ్ ఉందా?
- ఆ తేదీకి ముందే ప్లాట్ల సబ్‌డివిజన్ మరియు అధీకృత లేఅవుట్ అనుమతులు ఉన్నాయా?
- ఆ తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లు ఏ ప్రాతిపదికన జరిగాయి?
ఈ ప్రాథమిక అంశాలను కనీసం పరిశీలించకుండానే ఫైళ్లను ఆమోదించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ సేల్ డీడ్‌తో నివాస అనుమతులా? నాలా మార్పిడిపై మౌనం! : రికార్డులను పరిశీలిస్తే ఈ భూమికి సంబంధించి 2014 నాటి అగ్రికల్చరల్ సేల్ డీడ్ (సబ్-రిజిస్ట్రార్ మేడ్చల్ నంబర్ 5192/2014) ప్రస్తావన ఉంది. ఒక వ్యవసాయ సేల్ డీడ్ ఉండటం మాత్రమే నివాస భవన నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నట్లు నిరూపించదు.?
ఇక్కడ అత్యంత కీలకమైన నాల (నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్) కన్వర్షన్ జరిగిందా లేదా అనేదానిపై తీవ్ర సందేహాలున్నాయి. సదరు భూమిని వ్యవసాయేతర వినియోగానికి మారుస్తూ సంబంధిత రెవెన్యూ లేదా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయా? ఒకవేళ నాలా కన్వర్షన్ లేకుండానే వ్యవసాయ భూమిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారనేది టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలియాలి.
పరిపాలనా మార్పులు.. ప్రస్తుత అధికారుల ముందు పెద్ద సవాల్ : గతంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్, మేడ్చల్ సర్కిల్-60 (గుండ్లపోచంపల్లి వార్డు) కిందకు వచ్చింది. మున్సిపాలిటీలు లేదా అధికారులు మారినంత మాత్రాన గతంలో జరిగిన చట్టవిరుద్ధ అనుమతుల పాపాలు కనుమరుగైపోవు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే చట్టపరమైన చిక్కులను నివారించడానికి ప్రస్తుత అధికారులు ఈ ఐదు అనుమతుల ఫైళ్లను వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది.
సమగ్ర విచారణ జరిగితేనే అసలు బాగోతం వెలుగులోకి! : కేవలం ఈ ఐదు అనుమతులకే పరిమితం కాకుండా, గడిచిన కాలంలో ఈ ప్రాంతంలో ఎలఆరఎస్, నాలా, మరియు లేఅవుట్ నిబంధనలను పాటించకుండా మరెన్ని భవన అనుమతులు జారీ అయ్యాయనే కోణంలో సమగ్ర విచారణ జరగాలి.
సర్వే నంబర్ 32కు సంబంధించిన పూర్తి టైటిల్ పత్రాలు, నాలా ప్రొసీడింగ్స్, లేఅవుట్ కాపీలు మరియు భవన అనుమతి ఫైళ్లను బహిరంగంగా పరిశీలిస్తేనే అసలు నిజాలు నిగ్గుతేలుతాయి. నిబంధనలను గాలికి వదిలేసి అక్రమ అనుమతులు మంజూరు చేయడానికి సహకరించిన సంబంధిత అధికారుల పాత్రపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
