విజయవాడలోని ప్రముఖ శక్తిపీఠం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బంగారు బోనం జూలై 26న అత్యంత వైభవంగా సమర్పించనున్నారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లు చూపించడబనికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
బోనాల ఊరేగింపు ఉత్సవంలో 500 మంది కళాకారులు బేతాళ నృత్యకారులు , డప్పు కళాకారులు, పోతురాజులు, సంప్రదాయ వేషధారణలో మహిళలు, భక్తులు పాల్గొని విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు. తెలంగాణ బోనాల పండుగ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయానికి తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఆలయ అధికారుల సమాచారం ప్రకారం, శనివారం రాత్రికే హైదరాబాద్ నుంచి కళాకారులు, కమిటీ సభ్యులు విజయవాడకు చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలనుండి బోనాల ఊరేగింపు ప్రారంభమై నగరంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి, ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రకీలాద్రి చేరుకోనుంది. అనంతరం వేదమంత్రాల నడుమ శ్రీ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం కావడంతో పాటు ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో సారె సమర్పించేందుకు వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశముంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల విస్తరణ, తాగునీరు, వైద్య శిబిరాలు, అదనపు భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు.అదేవిధంగా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు.
జూలై 27 నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో జూలై 27 నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని వేలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శాకంబరీ దేవి ప్రకృతికి, పంటలకు, అన్నదాతలకు సంకేతంగా భావించబడుతారు. భక్తుల విశ్వాసం ప్రకారం అమ్మవారు కరువు సమయంలో ప్రజలకు ఆహారం అందించేందుకు శాకంబరీ రూపంలో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.ఈ అలంకరణ కోసం ఆలయ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేస్తోంది. వీటిపై వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను కళాత్మకంగా అమర్చనున్నారు. అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తమ పంటలను స్వచ్ఛందంగా సమర్పించేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
శని, ఆదివారాల్లోనే అవసరమైన సామగ్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే పది రోజులు ఆలయానికి అత్యంత కీలకమైనవిగా భావిస్తూ అన్ని విభాగాల సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రసాదాల పంపిణీ, పార్కింగ్, భద్రత, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు.
తెలంగాణ బంగారు బోనం సమర్పణతో పాటు శాకంబరీ ఉత్సవాలు కూడా ఒకే సమయంలో జరగనున్న నేపథ్యంలో ఈసారి ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముండటంతో ఆలయ ప్రాంతమంతా భక్తిరసంతో కళకళలాడనుంది.
