జవహర్‌నగర్ మున్సిపల్ పరిధిలో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ సుక్కమ్మ బస్తి, సుక్కమ్మ కుంట ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త భక్తులు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పండుగ వాతావరణంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా, పరిసరాలు డంపింగ్ యార్డ్‌ను తలపించేలా మారడంతో దుర్గంధంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సుక్కమ్మ కుంట ప్రాంతంలో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయి రోజుల తరబడి తొలగించకపోవడంతో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమలు, క్రిమికీటకాలకు చెత్త కుప్పలు ఆవాసాలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
చెత్తను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే ప్రాంతంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికార యంత్రాంగం స్పందించి సుక్కమ్మ బస్తి, సుక్కమ్మ కుంట ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించడంతో పాటు పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
