- చారిత్రిక అడుగు వేసిన కేంద్రం..
- 114 మల్టి పర్పస్ యుద్ధ విమానాల కొనుగోలు..
భారత వాయుసేనను(Indian Air Force) మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక అడుగులు వేస్తోంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 బహుళ ప్రయోజన యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన మెగా ఒప్పందాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఖరారు చేసే అవకాశం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, ఇది దేశ రక్షణ రంగ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా నిలుస్తుంది. ఫ్రాన్స్‌తో ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఈ డీల్‌ను ఖరారు చేయనున్నారు. ఈ ఒప్పందం పూర్తయితే, ఇప్పటికే భారత వాయుసేన(Indian Air Force) వద్ద ఉన్న 36 రఫేల్, నౌకాదళం కోసం ఆర్డర్ చేసిన 26 రఫేల్-ఎం జెట్‌లతో కలిపి మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 176కి చేరుతుంది. ప్రస్తుతం ఈ భారీ ఒప్పందానికి సంబంధించి ధరల వివరాలు, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు.
వాయుసేనలో తగ్గిపోతున్న ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని, ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో ఏటా కనీసం 36 నుంచి 40 విమానాలు అవసరమని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. దేశ సైనిక శక్తిలో వాయుసేన సామర్థ్యం అత్యంత కీలకమని, అందుకే దాన్ని నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశీయంగానే ఫైటర్ జెట్ ఇంజన్‌ను తయారు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు. “మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైనిక శక్తిగా మారాలి. యుద్ధ సన్నద్ధతకు స్వావలంబన చాలా ముఖ్యం” అని ఆయన అన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
