- తీవ్ర విమర్శలు చేసిన వీ. హనుమంత రావు..
- నాలుగోసారి అధికారం కోసం ఆరాటపడుతున్నారు..
నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు(Hanumantha Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగింపజేస్తున్నారని వీహెచ్ అన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి, కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా జనాభా గణన జరుగుతున్నా, అందులో ఓబీసీల ప్రస్తావన లేదని దుయ్యబట్టారు. ఈ అంశంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వీహెచ్ ప్రకటించారు. రేపు శంషాబాద్‌లో ఓబీసీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టి, ‘ఓబీసీ గర్జన’ను ఢిల్లీ వరకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాడేందుకు ఇదే చివరి అవకాశమని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ కేంద్రం ఓబీసీ గణన చేపట్టేవరకు పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
