- షేక్ షావలి
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, సాంకేతిక లోపాలు, పేపర్ లీకేజీలపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణ, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు మద్దతు తెలపాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి పిలుపునిచ్చారు.
శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత మూడు వారాలుగా సిజేపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరాహార దీక్ష దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దేశంలోని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరీక్షల అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేంద్ర విద్యామంత్రిని పదవి నుంచి తప్పించాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన కోసం సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని, ప్రజాస్వామిక విలువలకు అనుగుణమైనవని షేక్ షావలి పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
