నీ గెలుపును నువ్వే నిర్ధేశించుకో..
లేకపోతే నీకు రాజకీయ భవిష్యత్తు శూన్యం
- ఒకరి మీద ఒకరు బురదజల్లుకోవడం ఆపండి..
- అమాయకులైన ప్రజలను తప్పుదోవ పట్టించకండి..
- నిజానికి మీ పరిథిదాటి ఈ ప్రక్రియ జరిగే అవకాశం లేదు
- అసలైన ఓట్లను సజీవంగా ఉంచండి..
- అక్రమ చొరబాటుదారులను నిరోధించండి..
- భారత దేశ అస్థిత్వాన్ని, ఎన్నికల పవిత్రతను కాపాడండి..
- నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఈ ప్రపంచానికి చాటండి..
ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టేది ఓటింగ్ ప్రక్రియ.. ఎన్నికలు అన్నవి ఎంతో శక్తివంతమైనవి.. మనకోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవితవ్యం కోసం ఓటు హక్కును వినియోగించుకోవడం అన్నది తప్పనిసరి.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకోవడం అన్నది భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అద్భుత వరం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ జరుగుతోంది.. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల జాబితా సవరణ లేదా ఓటర్ల ధృవీకరణ కార్యక్రమం అనేది ప్రజాస్వామ్య బలోపేతానికి నిరంతరం జరిగే ఒక ప్రక్రియ.
అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికార పార్టీ, విపక్షాల మధ్య ఒకరకమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.. అయితే ఇరు వాదనలో కొంత సహేతుకమైన కారణాలు ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియ మాత్రం ఒక మహత్తరమైన ప్రక్రియ అని చెప్పవచ్చు.. నిజానికి సర్ లో ఏమి జరుగుతోంది.. రాజకీయ నాయకులు ఈ ప్రక్రియలో ఎందుకు పాల్గొనాలి.. పాల్గొనకపోతే వారి భవితవ్యం ఏమవుతుంది..? అన్న విషయాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..
ఓటర్ల నమోదు కార్యక్రమం సర్ ఖచ్చితంగా పాటించాలి.. నిర్వహించాలి.. ఈ బాధ్యత అన్ని పార్టీల నాయకులూ తీసుకోవాలి.. ఎందుకంటే ఓట్లే కీలకం.. అధికారం ఆశిస్తున్న అన్ని పార్టీలవాళ్ళు ముందుండి ఈ ప్రక్రియను కొనసాగించాలి.. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోయే పెను ప్రమాదం వుంది.. క్షేత్ర స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయినా.. అర్బన్ ఏరియాల్లో అయినా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలకు వారి వారి ప్రాంతాల్లో మంచి పట్టు ఉంటుంది..

ఎక్కడ, ఎవరు ఓటర్లుగా వున్నారో..? ఎవరు అర్హులో వారికి తెలిసినంతగా, అధికారులకు తెలియ కపోవచ్చు.. అందుకే రాజకీయ పార్టీలు తమ భవితవ్యం సజావు గా ఉండాలంటే ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాక తప్పదు.. తమ ప్రాంతంలో ఎవరున్నారు..? ఎవరు లేరు.. ఎవరు వలస వెళ్లారు..? ఎవరు కొత్తగా వచ్చారు అన్న విష యాల మీద వారికి అవగాహన ఖచ్చితంగా ఉంటుంది.. అందుకే ఈ ప్రక్రియలో వారు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి సర్ ప్రక్రిలో పాల్గొంటే ఖచ్చితమైన రీతిలో అసలైన ఓట్లను నమోదు చేయగలిగే అవకాశం ఉంటుంది.. అలా కాకపోతే తమకు రావాల్సిన ఓట్లు కూడా గల్లంతు అయ్యే ప్రమాదం ఉంది..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది.. అసలు ఓటర్ల జాబితా సవరణ లేదా ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటి? అనేది ఒకసారి చూస్తే.. ఎన్నికల సంఘం, అధికార బీజేపీ వాదన ప్రకారం, ఈ ప్రక్రియ యొక్క ప్రాథమిక లక్ష్యం “వన్ నేషన్, వన్ ఓటర్ ఐడీ” లేదా “స్వచ్ఛమైన ఓటర్ల జాబితా” రూపకల్పన అని చెబుతున్నారు..
ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓట్లు ఉండటం అంటే డూప్లికేట్ ఓట్లను నిరోధించడం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి పాత ఓట్లను తొలగించి, ప్రస్తుత నివాసంలో కొత్త ఓట్లు కల్పించడం. చనిపోయిన వారి పేర్లు ఇంకా జాబితాలోనే ఉండటం వల్ల జరిగే అక్రమ పోలింగ్‌ను అరికట్టడం. ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం ద్వారా నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడం. కానీ ప్రతిపక్షాల వారి వాదన మరోలా వుంది..
కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించడానికి కొన్ని బలమైన కారణాలు, ఆరోపణలు ఉన్నాయి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే సామాజిక వర్గాలు అంటే మైనారిటీలు, దళితులు, వెనుకబడిన తరగతులు, టార్గెట్ ఏరియాల్లోని ఓటర్ల పేర్లను కావాలనే జాబితా నుండి తొలగిస్తున్నారని విపక్షాల ప్రధాన ఆరోపణ. ఓటర్ల సమాచారాన్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సేకరించి, ఏ ఓటరు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారో విశ్లేషించి, ఆపై ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి అనుకూల మార్పులు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఈ వాదనలో వాస్తవం లేదన్నది విశ్లేషకుల వాదన.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది..
బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు.. కనుక కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్లు తెలంగాణాలో జరిగే అవకాశం లేదు.. బూత్ లెవల్ అధికారులను బెదిరించాల్సిన అవసరం లేదు.. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన ఓటర్లు ఎవరైనా రెండు ఓట్లు కలిగివున్నా.. అలాగే ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఓట్లు పొందినా వారిని తొలగించే అవకాశం ఉంది.. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుతుంది తప్ప ఎలాంటి పొరబాట్లకు అవకాశం ఉండదు..

అదే విధంగా విపక్షాలను తీసుకుంటే వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఏదైనా అక్రమాలకు పాల్పడితే అడ్డుకోవడానికి అవకాశం ఉంది.. అందుకే ముందుగా చెప్పుకున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ పెద్దలు.. (అన్ని పార్టీల్లోనూ) ఖచ్చితంగా తమ వంతుగా కాకుండా బాధ్యతగా సర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి.. అలాగే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిని గుర్తించి వారిని చేర్పించగలగాలి.. కనుక విపక్షాలు వాదిస్తున్నట్లు సర్ ప్రక్రియలో ఎలాంటి మోసం జరిగే అవకాశం లేదు..
అయితే ఇక్కడో విషయం మాత్రం చెప్పుకోవాలి.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉందన్నది కాదనలేని నిజం.. తమకు అనుకూలంగా అధిక సంఖ్యలో ఓట్లను నమోదు చేయించుకోవచ్చు.. ఇతర ప్రాంతాల వారిని సైతం ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చు..
అలాగే తమకు పట్టులేని ప్రాంతాల్లో విపక్షాల ఓట్లను అనేక కారణాలతో తొలగించేలా చేయవచ్చు.. పూర్తిగా ఇది జరుగుతుందని చెప్ప లేము.. కానీ అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన.. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత విలువైనది.. ఆ హక్కు అర్హతవున్న ప్రతిఒక్కరికీ లభించాలన్నది రాజ్యాంగం చెబుతున్న మాట.. ఎందుకంటే తమకు నచ్చిన నాయకుడిని, తమకు సేవచేసే నాయకుడిని, నీతి నిజాయితీ కలిగిన నాయకుడిని ఎన్నుకునే హక్కు ప్రతి ఓటరుకు ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడానికి ఎవరికీ లేదు..
హైదరాబాద్ నగరంలో మనం చూసాం పాతబస్తీలో ఎన్నెన్ని అక్రమ ఓట్లను తొలగించారో..? అలాగే ఒక బీ.ఆర్.ఎస్. నాయకుడు తనకు సంబంధించిన కాలేజీల విద్యార్థులను అక్రమంగా ఓటరు జాబితాలో చేర్పించి, ఆ ఓట్లతో ఎలా గెలిచాడో..? అలాగే ఒక్కో ఇంట్లో వేల సంఖ్యలో ఓట్లు ఉండటం కూడా చూసాం.. ఇలాంటివి తొలగాలంటే సర్ ప్రక్రియ జరిగి తీరాల్సిందే.. నిజమైన ఓటర్లు అప్పుడే వెలుగులోకి వస్తారు.. అప్పుడు మనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది..
ఇది ఎప్పటికీ కాదనలేని నిజం..ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితే ఒక రకమైన ఫలితాలు, అక్రమంగా జరిగితే మరో రకమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ నిజాయితీగా ప్రక్రియ జరిగితే.. దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజమైన ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ప్రజల అసలు తీర్పును ప్రతిబింబిస్తాయి. అర్హులైన యువతీ యువకులకు త్వరగా ఓటు హక్కు లభిస్తుంది.ఒకవేళ ప్రక్రియలో లోపాలు ఉంటే.. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకుండా ఓట్లు తొలగిస్తే, పోలింగ్ రోజున ఓటరు కార్డు పట్టుకుని వెళ్లిన సామాన్యుడు ఓటు వేయలేక నిరాశకు గురవుతాడు.
ఆధార్ లింకింగ్, అడ్రస్ వెరిఫికేషన్ ప్రక్రియల వల్ల నిరంతరం వలస వెళ్లే పేద కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నది మేధావుల వాదన.. ఇప్పటికే దేశంలోకి, ముఖ్యంగా తెలంగాణ రాష్టంలోకి, హైదరాబాద్ మహానగరంలోకి అక్రమంగా వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. వారంతా సుళువుగా ఓటు హక్కును సంపాదించుకున్నారు.. ఇలాంటి వారికి కొందరు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటుంది.. వారి ఓట్లతోనే ఆ నాయకులు ప్రతిసారీ గెలుపొందుతున్నారన్నది జగమెరిగిన సత్యం.. ఇలాంటి వారిని నిరోధించడానికి సర్ ప్రక్రియ అద్భుతంగా పని చేస్తుంది..
ఏది ఏమైనా ప్రజల్లో సర్ ప్రక్రియపై అపోహలు పెంచకుండా.. అన్ని పార్టీల నాయకులు నిజాయితీగా, నిబద్ధతగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని, ఓటు అనే మహత్తరమైన ఆయుధాన్ని సజీవంగా ఉంచడం అన్నది ప్రస్తుతం వారి ముందున్న కర్తవ్యం.. ఈ కర్తవ్యాన్ని విస్మరించిన వారు ఖచ్చితంగా రాజకీయంగా కనుమరుగైపోవడం ఖాయం.. ప్రజాస్వామ్య దేశంలో ఓటరు అస్థిత్వాన్ని బ్రతికించుకుందాం.. సమాజంలో విలువలను కాపాడుకుందాం.. ప్రజలకోసం, ప్రజలు ఎన్నుకునే నాయకులు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేలా చూసుకుందాం.. ఒకరిపై ఒకరు బురదజల్లు కోకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం సర్ ని గౌరవిద్దాం..
