- పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్
ఎస్.ఐ.ఆర్. అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఇది భారత ఎన్నికల సంఘం చేపట్టే చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. దీనికి కేంద్ర ప్రభుత్వానికి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఎస్.ఐ.ఆర్. నిర్వహించబడిందని, 2002లో జరిగిన సమగ్ర ప్రక్షాళన తర్వాత ప్రస్తుతం 2025లో కొన్ని రాష్ట్రాల్లో, 2026లో మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో రవి ప్రసాద్ గౌడ్ పలు బూతులను స్వయంగా పర్యటించడం జరిగింది. ఓటరు జాబితాల ప్రక్షాళన ప్రక్రియను పరిశీలించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 57 కోట్ల మంది ఓటర్ల వివరాల ప్రక్షాళన పూర్తయిందని, మరో 37 కోట్ల మంది ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎస్.ఐ.ఆర్.పై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ప్రతినిధులను నియమించాయని వారు కూడా భాగస్వాములయ్యారని రవి ప్రసాద్ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్.ఐ.ఆర్. అనేది భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే చట్టబద్ధమైన ప్రక్రియ అని, దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకొని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా సహకరించాలని రవి ప్రసాద్ గౌడ్ కోరారు. అక్రమంగా నివసిస్తున్న విదేశీ వారి పేర్లు ఓటరు జాబితాల్లో చోటు చేసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్, నాగరాజు, కవిత, మహేందర్, రాధ, మాధవి, సాయి కిరణ్, నర్సింగ్, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు..
