- రైతుల కష్టానికి తక్కువ ధర.. వినియోగదారులపై రెట్టింపు భారం
- పార్కింగ్ పేరుతోనూ దోపిడీ.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
- అన్ని రైతు బజార్లలో అధికారుల పర్యవేక్షణ నిజాయితీగా కొనసాగాలి..
- తెలంగాణ మార్కెటింగ్ అధికారులు దృష్టి పెట్టాలి..
సరూర్నగర్ రైతుబజారులో(Saroornagar Rythu Bazar) దళారుల దందా, అక్రమ వసూళ్లు, మౌలిక వసతుల కొరతతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను వేలం ద్వారా వ్యాపారులు దక్కించుకుంటుండగా.. ఆ తర్వాత వాటిని వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వేలంలో దక్కిన ధరకు, వినియోగదారులకు విక్రయించే ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని, కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రెట్లు అధికంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు నుంచి మార్కెట్ వరకు, అక్కడి నుంచి వినియోగదారుడి వరకు మధ్యవర్తుల వ్యవస్థ బలపడటంతో అసలు భారమంతా సామాన్యులపైనే పడుతోందని చెబుతున్నారు.
పార్కింగ్ పేరుతో ఇష్టారాజ్య వసూళ్లు..?
రైతుబజారుకు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారుల నుంచి వాహనాల పార్కింగ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్కింగ్ రుసుము వసూలు చేయడానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో, స్పష్టమైన నియమ నిబంధనలు లేదా అధికారిక రుసుముల పట్టిక ఏదీ ప్రజలకు అందుబాటులో లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు.
అయినప్పటికీ మార్కెట్ నిర్వహణకు సంబంధించిన వారు తమకు తాముగా రుసుములు నిర్ణయించుకుని, ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేకుండానే పార్కింగ్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపు మాత్రమే వాహనం నిలిపినా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నించే వినియోగదారులకు సరైన సమాధానం చెప్పేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అనుమతి, జీవో లేదా నిర్దిష్ట నిబంధనలు లేకుండా పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారా? అలా అయితే ఈ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు? వసూలైన డబ్బు ఎక్కడికి వెళ్తోంది? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైతుబజారులో పార్కింగ్ పేరుతో జరుగుతున్న వసూళ్లపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు.. అక్రమ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? :
రైతుబజారులో ధరల నియంత్రణ, దళారుల జోక్యాన్ని అరికట్టడం, పార్కింగ్ రుసుములపై పర్యవేక్షణ, వినియోగదారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. రైతుబజారు ఉద్దేశం రైతుకు గిట్టుబాటు ధర.. వినియోగదారుడికి సరసమైన ధర కల్పించడమేనని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తుల దందాతో ఆ లక్ష్యం నీరుగారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరూర్నగర్ రైతుబజారులో(Saroornagar Rythu Bazar) జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అధిక ధరల విక్రయాలు, దళారుల జోక్యం, పార్కింగ్ పేరుతో వసూళ్లపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, రైతులు మరియు వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
