HomeతెలంగాణKalvakuntla Ramya Rao | మా ఆస్థి ఎక్కడ..?

Kalvakuntla Ramya Rao | మా ఆస్థి ఎక్కడ..?

  • ఫామ్ హౌస్‌లో కూర్చుని వేలకోట్లు కూడబెట్టారు..
  • గతంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ కు వేధింపులు..
  • కేసీఆర్ ఖాందాన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి
  • కేటీఆర్ వ్యాఖ్యలకు కౌటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు..
  • కేటీఆర్, తాను ఒకే తాత వారసులమని వెల్లడి..
  • వందల ఎకరాలున్నాయని అంటున్నారు.. మరి మా భూములెక్కడ..?
  • సంతోష్ రావు కూడబెట్టిన ఆస్తుల చిట్టా బయటకు రావాలి..
  • ప్రకంపనలు సృష్టిస్తున్న కేసీఆర్ అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆరోపణలు

“మా తాత ఆస్తుల్లో మా భాగం ఏది?” కేసీఆర్ కుటుంబంపై సొంత అన్న కూతురు కల్వకుంట్ల రమ్యా రావు సంధించిన ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫాంహౌస్ పాలన పదేళ్ల బండారం బయటపడుతోందని హెచ్చరిస్తూ కేటీఆర్‌ను ఆమె కార్నర్ చేశారు. రక్తం పంచుకు పుట్టిన కుటుంబంలోనే ఆస్తుల రగడ! కేటీఆర్ వాదనలను ఆవేదనతో బద్దలుకొట్టిన రమ్యా రావు.. “మా ఆస్తి ఎక్కడ?” అంటూ కేసీఆర్ కుటుంబానికి గాంధీ భవన్ వేదికగా సవాల్ విసిరారు.

ఈ క్రమంలో కుటుంబ పోరు రక్తి కట్టింది.. వందల ఎకరాల తాతల ఆస్తులు ఉంటే.. తమ వారసత్వ భూమి ఎక్కడని సూటిగా ప్రశ్నించిన రమ్యారావు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. జోగినపల్లి సంతోష్ రావు పాత్రపైనా ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు.. ఇప్పుడు కల్వకుంట్ల కోటను బలంగా తాకాయి.. ఈ దెబ్బతో కల్వకుంట్ల కోట నిలువునా కూలిపోనుందా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.. రమ్యరావు ప్రశ్నలకు జవాబులు వెతుక్కునే పనిలో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం సతమతమవుతోంది అన్నది వాస్తవం..

- Advertisement -

బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేసీఆర్ సొంత అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు(Kalvakuntla Ramya Rao) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను అడ్డగోలుగా దోచుకుందని, ఫాంహౌస్‌లలో కూర్చొని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిందని ఆమె ఆరోపించారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి భూకబ్జాలు, అక్రమాలపై పోరాడితే ఆయనపై కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రమ్యా రావు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కల్వకుంట్ల కుటుంబానికి తాతల కాలం నుంచే వందల ఎకరాల భూములు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రమ్యారావు(Kalvakuntla Ramya Rao) ప్రశ్నించారు. తాను కేసీఆర్ సొంత అన్న కుమార్తెనని, కేటీఆర్, తాను ఒకే తాత రాఘవరావు వారసులమని పేర్కొన్నారు. “కేటీఆర్ చెప్పేది నిజమైతే కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల భూములు ఉండాలి. మరి ఆ వందల ఎకరాల్లో మా భూమి ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. తనకు, కవితకు పెద్ద మొత్తంలో ఆస్తులు లేకపోయినా కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె నిలదీశారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో కుటుంబ ఆస్తుల పరిస్థితి ఏమైందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కోరారు.

సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు :

జోగినిపల్లి సంతోష్ రావు ఆస్తులపై కూడా రమ్యారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని చెప్పిన సంతోష్ రావు తరువాత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఎలా మారారని ప్రశ్నించారు. “సంతోష్ రావు నీ బినామీనా? ఆయన ఆస్తుల వ్యవహారంపై కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?” అంటూ కేటీఆర్‌ను నిలదీశారు. కరీంనగర్‌లో గతంలో సాధారణ జీవితం గడిపిన సంతోష్ రావుకు ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువైన భూములు, ఇళ్లు, వాణిజ్య ఆస్తులు ఎలా వచ్చాయో వివరించాలని డిమాండ్ చేశారు. మార్కుక్‌లో 9 ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఆస్తులు, కొండాపూర్‌లో ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

2015లో బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో కుదురుపాక గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైన సమయంలో సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 8 ప్లాట్లకు పరిహార పట్టాలు పొందారని రమ్యా రావు ఆరోపించారు. గ్రామంతో సంబంధం లేని వారు కూడా ముంపు పరిహారం కింద ప్లాట్లు పొందారని పేర్కొన్నారు. సంతోష్ రావు తనను బీసీగా చూపించి ముంపు ప్రాంతంలో ప్లాటు పొందారని ఆమె ఆరోపించారు. 2018 రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఒక్క ప్లాట్‌ను మాత్రమే చూపించి మిగిలిన ఆస్తులను ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కుదురుపాక ప్రధాన రహదారిలో బాధితుల భూముల వ్యవహారంపైనా ఆమె ఆరోపణలు చేశారు. “2018లో రాజ్యసభకు ఎన్నికయ్యే సమయంలో సంతోష్ రావు అఫిడవిట్‌లో ఒక్క ప్లాట్ మాత్రమే చూపించారు.

ఎనిమిది ప్లాట్లు తీసుకున్నట్లయితే మిగిలిన ఏడు ప్లాట్లు ఎక్కడ?” అని రమ్యా రావు ప్రశ్నించారు. అఫిడవిట్‌లో చూపని ఆస్తులు, తరువాత కాలంలో ఏర్పడిన ఆస్తులపై సమగ్ర విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. సంతోష్ రావు భార్య రోహిణి పేరిట నానక్‌రామ్‌గూడలో సుమారు రూ.21.40 కోట్ల విలువైన కమర్షియల్ భవనాలు ఎలా వచ్చాయని రమ్యారావు ప్రశ్నించారు. వీటికి సంబంధించిన ఆస్తుల మూలాలు, లావాదేవీలు, యాజమాన్య వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే సిరిసిల్ల జిల్లా వర్ధపల్లి గ్రామంలో సంతోష్ రావు తండ్రి జోగినిపల్లి రవీందర్ రావుకు ప్రధాన రహదారి వెంట ఉన్న భూములపైనా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. బినామీల పేర్లతో భారీగా భూములు ఉన్నాయని ఆరోపించారు.

కేటీఆర్ మౌనం దేనికి సంకేతం :

తమ కుటుంబానికి చెందిన వారిని పక్కన పెట్టి సంతోష్ రావును కేసీఆర్ కుటుంబం ఎందుకు దగ్గరకు తీసుకుందని రమ్యారావు ప్రశ్నించారు. సంతోష్ రావు ఆస్తులపై ఆరోపణలు వస్తున్నా కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. “అక్కను, చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? సంతోష్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ఆయనకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో కేటీఆర్‌కు తెలియదా?” అని ప్రశ్నించారు. సంతోష్ రావుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయని రమ్యారావు ఆరోపించారు. ఆస్ట్రేలియాలోని ఆస్తులు, బినామీల పేర్లతో ఉన్న భూములు, హవాలా రూపంలో దాచిన ఆస్తులపై కూడా విచారణ జరగాలని కోరారు.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, ఆధారాలను సంబంధిత దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం, సంతోష్ రావు తదితరులకు సంబంధించిన భూములు, ఆస్తులు, బినామీ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రమ్యా రావు డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చే అంశాలను కూడా పరిశీలించాలని కోరారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే బయటపెట్టామని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని రమ్యారావు అన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News