- ఫిర్యాదు చేయండి,తక్షణమే చర్యలు తీసుకుంటాం!
- సీపీ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు,యువతుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,వేధింపులకు గురిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా మౌనంగా ఉండకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని,తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.షీ టీమ్స్ కార్యకలాపాలపై వివరాలు తెలుపుతూ అక్టోబర్ నెలలో మొత్తం 69 ఫిర్యాదులు అందాయని,అలాగే పబ్లిక్ ప్రదేశాలలో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 60 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని,వారిపై కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్,పోక్సో,బాల్య వివాహాలు,సైబర్ నేరాలు వంటి అనేక అంశాలపై స్కూళ్లు,కాలేజీలలో మొత్తం 53 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 లేదా డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీసు సహాయం పొందాలని సీపీ సూచించారు.
