- విజయాన్ని కాంగ్రెస్-ఆర్జేడీ మాత్రం ఇష్టపడటం లేదు
- ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్లు ఇంకా కోలుకోలేదు
- ఉగ్రస్థావరాలపై బాంబులు పడుతుంటే.. కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపింది
- ఆర్జేడీకి అనుకూలంగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ అనుకోలేదు
- కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుంది
- మహా కుంభమేళాను ఇరు పార్టీల నేతలు అవమానించారు
- కాంగ్రెస్-ఆర్జేడీలపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్లు కోలుకోలేకపోయాయని అన్నారు. ఆ ఆపరేషన్ సమయంలో దాయాది దేశంలో ఉగ్రస్థావరాలపై బాంబులు పడుతుంటే.. ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ‘జంగల్ రాజ్’ ను బిహార్ ప్రజలు మర్చిపోలేదని, ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడబోతున్నారని చెప్పారు.
అంతేకాకుండా ఆర్జేడీకి అనుకూలంగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ అనుకోలేదని తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు హస్తం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా లేదన్నారు. కానీ.. కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుందని ఎన్నికల అనంతరం ఆ పార్టీల నేతలు పరస్పరం పోట్లాడుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహా కుంభమేళాను ఇరు పార్టీల నేతలు అవమానించారని, ఓ కాంగ్రెస్ నేత ఛర్ పూజను అపహాస్యం చేశారని. ఇకపై ఎవరూ అలా చేసేందుకు ధైర్యం చేయనంతగా వారికి గుణపాఠం నేర్పాలన్నారు.
