దేశ రాజధానిలో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జర్నలిస్టులు విద్యాసాగర్ వేముల (ఆంధ్రజ్యోతి), వంగ తిరుపతి (వెలుగు), రాజశేఖర్‌రెడ్డి (సాక్షి) ప్రతిష్ఠాత్మక ‘జాతీయ వాగ్దేవి’ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ భవన్‌లో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు సంబరాలు’ పేరిట జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) జయంతి వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను స్వీకరించారు. జర్నలిజంలో కనబరిచిన ప్రతిభకు గాను విద్యాసాగర్, తిరుపతిలకు ‘జాతీయ వాగ్దేవి పురస్కారాలు ప్రదానం చేయగా, రాజశేఖర్‌రెడ్డికి ‘వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.
ఇదే వేదికపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, కాశీ విశ్వనాథరాజులకు ‘వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారాలు’ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, బీదా మస్తాన్‌రావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
