- పొనికి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం.. పుష్కరాల్లో విక్రయాలు, ప్రదర్శనకు స్టాళ్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra)తెలిపారు.
మంగళవారం నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.



బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
