జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణా నగర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంటన శివసేన రెడ్డి, సంజయ్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. భారీ ర్యాలీగా వెళ్తూ మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థించారు. అనంతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ (Street Corner Meeting)లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
ఆయన ప్రసంగం..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం (Brs Party) జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాంతానికి అభివృద్ధిని దూరం చేసింది. ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా నీటి సమస్య తీర్చలేదు. గుండాయిజంతో రాజకీయం నడిపి పోలీసులను పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సమస్యలు పరిష్కారమవుతున్నాయి. నీటి సమస్యలకు చెక్ పెట్టాం. హైదరాబాద్ కి మరింత తాగు నీటిని తీసుకురావడానికి పనులు ప్రారంభమయ్యాయి.
ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో పథకాలు చేపట్టాం. పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. అక్కడి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గణేష్ (Mla Ganesh) నాయకత్వంలో నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతోంది. నవీన్ యాదవ్ విద్యావంతుడు, యువకుడు, స్థానికుడు. ఉత్సాహంగా పని చేసే వ్యక్తిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం.
