Sunday, April 19, 2026
Homeహైదరాబాద్‌Arrive Alive | “అరైవ్ అలైవ్” ద్వారా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Arrive Alive | “అరైవ్ అలైవ్” ద్వారా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ఆరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ నందు నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రోడ్డు రవాణా బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున “అరైవ అలైవ్” అనే నినాదంతో రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రహదారులపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని వేలాది మంది వారి విలువైన ప్రాణాలను కోల్పోతున్న విషయాన్ని మనం ప్రతిరోజు పత్రికల్లో చూస్తున్నామని అన్నారు.

- Advertisement -

అందుకే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ” అరైవ్ అలైవ్ ” అనే నినాదంతో, రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు పెద్ద ఎత్తున రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల సామ దాన ,భేద, దండ రూపాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నడుం కట్టిందని తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు పోలీస్, రవాణా శాఖ ద్వారా పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలలో రోడ్డు భద్రత పై విస్తృత ప్రచారం చేస్తుందని తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారిని మొదటి ‘గోల్డెన్ అవర్లో’ హాస్పిటల్కు చేర్చి వారి ప్రాణాలను కాపాడాలనీ, గతంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే కేసుల భయంతో ఎవరు పట్టించుకోకపోయేది. ఇప్పుడు ప్రమాదం జరిగిన మొదటి గంటలో హాస్పిటల్ కి చేర్పిస్తే 25 వేల పారితోషికం తో రహవీర్ అవార్డు అందిస్తుంది అని అన్నారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు యువతకు, విద్యార్థులకు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై రోడ్డు భద్రత నియమాలపై తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

శాసన సభ్యులు అరికే పూడి గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని, దీన్ని ప్రజల సహకారంతో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. రహదారి ప్రమాదాలు ముఖ్యంగా అతివేగం,హెల్మెట్ లేమి, సీట్ బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ సంభవిస్తున్నాయని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ తరచూ వాహనాల తనిఖీలను నిర్వహించి రోడ్డు భద్రత నియమాలపై ఆవగాహన కల్పించాలని కోరారు.

రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ, అతివేగంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని అన్నారు. రోడ్ ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ పెద్ద ఎత్తున అరైవ్ అలైవ్ అనే నినాదంతో అవగాహన కల్పించడం, రోడ్డు నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను రోడ్డు భద్రత నిబంధనలను పాటించి వారి ప్రాణాలు కాపాడుకొని బాధ్యతగా మెలగాలని అన్నారు.

అనంతరం రోడ్డు నిబంధనలు పాటిస్తామని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఉత్తమ డ్రైవర్లుగా దేశ్య, రమేష్ కేబి సింగర్ లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, రవాణా శాఖ అధికారులు, డ్రైవర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News