ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు,గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.
విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు.విద్యార్థులతల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.
వీసీ అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె . శ్రీనివాస్, పిడి డి ఆర్ డి ఏ శ్రీలత, సిపిఓ సౌమ్య, డిపిఓ సురేష్ మోహన్, డీఈఓ సుశీందర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు కేషు రామ్, రామేశ్వరీ దేవి, నవీన్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
