Homeఆదాబ్ ప్రత్యేకంGovernment Land Scam | సర్కార్ భూమికి ‘స్కెచ’!

Government Land Scam | సర్కార్ భూమికి ‘స్కెచ’!

భగదిత్య ఇన్ఫ్రా భాగోతం బట్టబయలు
మంఖల్‌లో 35.26 ఎకరాలు.. 39 సబ్ డివిజన్లు.. రియల్ ఎస్టేట్ చేతుల్లోకి?

  • ప్రభుత్వ భూముల లూటీకి ((Government Land Scam) )తెరవెనుక ఐఏఎస్ మాస్టర్ మైండ్స్
  • నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ బినామీల గుట్టు రట్టు
  • ‘భగదిత్య ఇన్ఫ్రా’ డైరెక్టర్లుగా కలెక్టర్ సతీమణి, బినామీ రాయాపురెడ్డి
  • మంఖల్ భూ వ్యవహారం వెనుక అసలు ‘కింగ్‌పిన’ ఎవరు?
  • ఈ భూ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609 మరియు 610లలో వెలుగు చూసిన 35 ఎకరాల 26 గుంటల భూ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 1954-55 పహాణీ రికార్డుల్లో అక్షరాలా ‘సర్కార’ భూమిగా నమోదైన ఈ అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని, ఒక ఐఏఎస్ అధికారి తన అధికార దర్పాన్ని అడ్డంపెట్టుకుని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసిన వైనం వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. కేవలం మంఖల్ భూ వివాదమే కాకుండా, ఇదే అధికారి హయాంలో రంగారెడ్డి జిల్లా కేంద్రంగా సాగిన వేల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

- Advertisement -

39 సబ్-డివిజన్లు.. రియల్ ఎస్టేట్ హస్తగతం!

ఈ 35.26 ఎకరాల భూమిని అత్యంత వ్యూహాత్మకంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి, వివిధ వ్యక్తుల పేరిట మరియు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల పేరిట మ్యూటేషన్లు చేయించుకున్నారు. ఈ సర్వే నంబర్ల పరిధిలో మొత్తం 39 సబ్-డివిజన్లు సృష్టించబడి, పాస్‌బుక్‌లు జారీ చేయడమే కాకుండా, నాలా మార్పిడి చర్యలు మరియు రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు స్పష్టమవుతోంది. సర్వే నం. 608: మందాడి రితేశ్ రెడ్డి, కాలకుంట్ల తిరుపతి రావు, మొహమ్మద్ అబ్దుల్ కబీర్, వద్దిరెడ్డి బాల్‌రెడ్డి, వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ (రాయాపు రెడ్డి), పల్లాపు గోవర్ధన్ తదితరుల పేరిట వివిధ విస్తీర్ణాల్లో సబ్-డివిజన్లు జరిగాయి.

సర్వే నం. 609: వద్దిరెడ్డి బాల్‌రెడ్డి, వీకేఆర్ బిల్డర్స్, తబ్రేజుద్దీన్ అమీరుద్దీన్, మొహమ్మద్ అబ్దుల్ రహీమ్, మొహమ్మద్ అబ్దుల్ కబీర్ పేరిట విస్తృతంగా భూ విభజన జరిగింది. సర్వే నం. 610: చెక్కల ఎల్లయ్య, రాయా ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముసినిపల్లి అశ్విన్, నాంపల్లి సిద్ధార్థ్, శివగల్ల పెద్ద చౌడయ్య మరియు వీకేఆర్ బిల్డర్స్ పేరిట పలు సబ్-డివిజన్లు నమోదయ్యాయి.
ముఖ్యంగా ఒకే ఖాతా నంబర్ (61626) కింద ‘వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స’ పేరుతో పెద్దఎత్తున సబ్-డివిజన్లు ఉండటం ఈ కుంభకోణంలో కార్పొరేట్ సంస్థల హస్తాన్ని, అధికారుల బరితెగింపును తేటతెల్లం చేస్తోంది.

ఈ భారీ భూ కుంభకోణంలో నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దుగ్యాల అమోయ్ కుమార్ పాత్ర అత్యంత దుర్మార్గమైనదిగా, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా స్పష్టమవుతోంది. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రాజ్యాంగ పదవిలో ఉంటూనే, స్వయంగా భూ కబ్జాలకు తెరలేపడం ఆయన బరితెగింపునకు నిదర్శనం. తన మిత్రుడు, బినామీ అయిన రాయాపురెడ్డి వద్దిరెడ్డితో కలిసి ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ కుంభకోణంలో భాగంగానే ‘భగదిత్య ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ’ అనే బినామీ కంపెనీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి.ఈ కంపెనీకి రాయాపురెడ్డి వద్దిరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, నాటి కలెక్టర్ దుగ్యాల అమోయ్ కుమార్ సతీమణి దుగ్యాల ప్రణీత డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సర్వేనెంబర్ 9, ఫ్లాట్ నంబర్ 308, ట్రాంక్విల్ టవర్స్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్‌లో ఈ కంపెనీ అన్‌లిస్టెడ్ కేటగిరీలో యాక్టివ్‌గా ఉంది.

ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పక్కా స్కెచ్‌తో బినామీ పేరిట మార్చుకున్న(Government Land Scam) ఈ బాగోతం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు సెత్వార్ రికార్డులు, మూల ఫైళ్లు లేకపోయినా.. అప్పటి తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ నవత, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తప్పుడు నివేదికలు సృష్టించి ఈ అక్రమానికి సహకరించడం అధికారుల దిగజారుడుతనానికి పరాకాష్ట.

వేల కోట్ల గత భూ కుంభకోణాలపై ఈడీ పంజా!

అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో కేవలం మంఖల్ భూ కుంభకోణమే కాకుండా, అంతకుమించి వేల కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూములు, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఈడీ అధికారులు అత్యంత తీవ్రస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ధరణి పోర్టల్ మరియు ఇతర రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి నిషేధిత, ప్రభుత్వ, భూదాన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, బినామీ కంపెనీలకు కట్టబెట్టిన వైనంపై ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ వేల కోట్ల రూపాయల అక్రమాల దర్యాప్తులో భాగంగానే ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను నేరుగా విచారించడంతో పాటు, దీని వెనుక ఉన్న పెద్దల పాత్రపై లోతైన ఆరా తీస్తున్నారు.

Mankhal Government Land Scam Investigation0

డీఓపీటీ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

ఇలా వేల కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుసగా విచారణ జరుపుతున్నా, ప్రాథమికంగా తీవ్రమైన ఆరోపణలు రుజువువుతున్నా, ఒక ఐఏఎస్ అధికారిపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరం.

ఐఏఎస్ అధికారుల అవినీతి అక్రమాలపై ఈడీ లాంటి కేంద్ర సంస్థల విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ, డీఓపీటీ కాలయాపన చేయడం, సస్పెన్షన్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంలో మీచమడడం (మీనమేషాలు లెక్కించడం) వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలు, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నాటి కలెక్టర్ అమోయ్ కుమార్‌ను చట్టపరంగా సాగనంపాల్సింది పోయి, కీలక శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చట్టం అందరికీ సమానమేనా? చిరుద్యోగికి ఒక రూలా.. ఐఏఎస్‌కు మరో రూలా?

”ఒక చిరు ఉద్యోగి రూ. 1,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కితే క్షణాల వ్యవధిలో సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగిస్తారు. కానీ, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టి,ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారికి మాత్రం ఏ చట్టం వర్తించదు?” అంటూ ప్రజలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఈ కుంభకోణానికి సంబంధించిన సమగ్ర ఆధారాలు అందించినప్పటికీ, జిల్లాస్థాయి అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే ప్రేక్షక పాత్ర పోషిస్తే సామాన్యులకు న్యాయం జరిగేదెలా?

తక్షణ డిమాండ్ :

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తక్షణమే జోక్యం చేసుకుని నిందితుడైన ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసి క్రిమినల్ విచారణకు అనుమతించాలని, అదేవిధంగా మంఖల్ భూములతో పాటు ఈడీ విచారిస్తున్న వేల కోట్ల భూ కుంభకోణాలపై సిట్టింగ్ అధికారులతో లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో సమగ్ర దర్యాప్తు జరిపించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News